కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ దిశగా..

17 Aug, 2017 01:38 IST|Sakshi
కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ దిశగా..

పార్టీ పదవులు, గవర్నర్లు, నామినేటెడ్‌ పోస్టుల నియామకంపైనా...
కార్యాచరణ ప్రారంభించిన ప్రధాని మోదీ  


సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు సమావేశాలు పూర్తవడంతో పార్టీ పదవులు, కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు. ఆరు రాష్ట్రాలకు గవర్నర్లు, ప్రభుత్వంలోని ఇతర కీలక పదవులనూ ఆయన భర్తీ చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రధాని కార్యాచరణ ప్రారంభించినట్లు బీజేపీ, ప్రధానమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం. ‘ఈ ఏడాది గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో వచ్చే ఏడాది ఆరంభంలో పలు ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగానే ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది.

2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ఖాళీల భర్తీ ఉంటుంది’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విలీనమైనట్లు ధ్రువీకరణ జరిగితే.. ఆ పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడంతోపాటు ఒకరికి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశాలున్నట్లు చెప్పారు. జేడీయూ నుంచి ఒకరికి కేబినెట్‌లో చోటు దక్కవచ్చన్నారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటంతో ఆయన చేపట్టిన సమాచార, ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలు.. అరుణ్‌ జైట్లీ వద్ద అదనంగా ఉన్న రక్షణ శాఖ, దివంగత మంత్రి అనిల్‌ దవే నేతృత్వంలోని అటవీ, పర్యావరణ శాఖలను భర్తీ చేయాల్సి ఉంది.

 75 ఏళ్లు దాటిన కల్రాజ్‌ మిశ్రాతోపాటుగా సరైన పనితీరు కనబరచని మంత్రులపైనా వేటు తప్పదని తెలుస్తోంది. కొత్తగా ఎంపిక చేసుకునే మంత్రులు, వారి శాఖల విషయంలో ప్రాంతీయ, కుల సమీకరణాలను ప్రధాని పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం. వివాదాస్పద రికార్డులున్న వారికి సీనియారిటీ ఉన్నా చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. అటు పార్టీలోనూ చాలాకాలంగా పునర్వ్యవస్థీకరణ జరగలేదు. 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికవరకూ పదాధికారుల బాధ్యతలు మార్చలేదు.

పార్టీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించటంతో పార్టీలో వారి పదవులు ఖాళీగానే ఉన్నాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకూ కొత్త గవర్నర్లను కేటాయించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. ఎలక్షన్‌ కమిషనర్‌ (ముగ్గురికి గానూ ఇద్దరే బాధ్యతల్లో ఉన్నారు), నీతి ఆయోగ్‌కు కొత్త సభ్యులు, బ్యాంకులకు నామినేటెడ్‌ పోస్టులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్ల పదవులనూ మోదీ వీలైనంత త్వరగా భర్తీ చేయనున్నారని సమాచారం.

కేబినెట్‌లోకి రాం మాధవ్‌?
కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నుంచి ఒకరికి చోటు దక్కనుం దనే ఊహాగానాలు వినబడుతు న్నాయి. విశాఖ ఎంపీ హరిబాబు లేదా పార్టీ ప్రధాన కార్య దర్శి రాంమాధవ్‌లలో ఒకరికి బెర్త్‌ ఖాయమని తెలుస్తోంది. ఆగస్టు 28 నుంచి ఏపీలో పర్యటించనున్న అమిత్‌ షా ఇప్పటికే పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ టీడీపీ తెరచాటు పార్టీ గా ఉన్న బీజేపీని సొంత కాళ్లపై నిలబెట్ట డం అమిత్‌ షాకు అంత సులువేం కాదు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడంతో రాంమాధవ్, హరిబాబుల్లో ఒకరిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు