ఎస్పీ-కాంగ్రెస్ కటీఫ్‌? రంగంలోకి ప్రియాంక

21 Jan, 2017 08:50 IST|Sakshi
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మంచి సస్పెన్స్ డ్రామాను తలపిస్తున్నాయి. నిమిషానికో సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తండ్రీ కొడుకుల మధ్య ఏదో జరిగిపోయిందని అనుకుంటే.. శివపాల్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా అదంతా తుస్‌మన్నట్లే అయింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్డీలతో కూడిన మహా కూటమి బీజేపీ - బీఎస్పీల భరతం పడుతుందని ముందునుంచి చెబుతుంటే, ఇప్పటికే ఆర్ఎల్డీ దాంట్లోంచి తప్పుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంగతి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఎవరికి వాళ్లు పంతాలు పట్టింపులకు పోతుండటంతో పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ప్రియాంకా గాంధీ వెంటనే రంగంలోకి దిగారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో చర్చించడానికి తన వ్యక్తిగత దూతను లక్నో పంపారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ 210 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేయడంతో కాంగ్రెస్‌లో గుబులు పట్టుకుంది. రెండు పార్టీల మధ్య పొత్తు విషయం ఇంకా ఏమీ తేలకముందే ఇలా సొంత జాబితా ఇచ్చేయడం, అందులోనూ.. గాంధీల కంచుకోటలు అయిన అమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కూడా ఉండటం కాంగ్రెస్‌ను కలవరపరిచింది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తామే పోటీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ వ్యవహారం గురించి మాట్లాడేందుకు ప్రియాంక తరఫున దూతగా వచ్చిన ధీరజ్.. సీఎం అపాయింట్‌మెంట్ కోసం వేచి చూస్తున్నారు. 
 
ఇంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తోనే తాము ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఆయనతో చర్చిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ చెప్పారు. అయితే, ప్రియాంకా గాంధీ ఏకంగా 11 మెసేజ్‌లు పెట్టినా, అఖిలేష్ నుంచి వాటికి సమాధానం వెళ్లలేదని విశ్వసనీయ సమాచారం. దాంతో అసలు మహాకూటమి విషయం పక్కన పెడితే మామూలు పొత్తులు కూడా అయోమయంలోనే పడ్డాయి. అవసరమైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కూడా రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. చిట్టచివరి నిమిషంలో అఖిలేష్ ఇలా చేస్తారని కాంగ్రెస్ అసలు ఊహించలేదు. 
 
తమకు కనీసం వంద సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ ఒప్పుకొందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నా, అది చాలా పెద్ద సంఖ్య అవుతుందని సమాజ్‌వాదీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఏమంత గొప్పగా లేదని, గత ఎన్నికల్లో కేవలం 28 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆ పార్టీకి ఇప్పుడు ఏకంగా వంద స్థానాలు కేటాయిస్తే వాటిలో కూడా తాము కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా లక్నో వచ్చి చర్చించాలని అఖిలేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనికి కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాలేదు. రాహుల్ వస్తే ఇద్దరూ కలిసి సంయుక్త ప్రచారం చేద్దామని కూడా అఖిలేష్ ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్నాళ్లూ 103 సీట్లు అడుగుతుండగా, ఒక్కసారిగా ఆ సంఖ్యను 138కి పెంచేసింది. అసలు వంద స్థానాలు ఇవ్వడమే దండగ అనుకుంటే ఇప్పుడు ఏకంగా 138 ఎలా ఇస్తామన్నది సమాజ్‌వాదీ వర్గాల వాదన. ఆదివారం నాడు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. 
 
లాభం ఎవరికి? 
ఒకవేళ నిజంగానే సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పొత్తు కుదరకపోతే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. ప్రశాంత కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తను రంగంలోకి దించినా అక్కడ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. 404 (403 + ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ మెంబర్) అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఈసారి కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తే 15 స్థానాలకు మించి రావడం కష్టమని కూడా అంటున్నారు. కానీ, ఆ పార్టీ సమాజ్‌వాదీ, బీఎస్పీల నుంచి ముస్లిం ఓట్లను కొంతమేర చీల్చుకుంటుంది. అప్పుడు అసలు ప్రయోజనం మొత్తం బీజేపీకి వస్తుంది. సమాజ్ వాదీ, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు జరిగితే మాత్రం కమలనాథులు ప్రశాంతంగా ఉండొచ్చనేది ఎన్నికల పండితుల అంచనా. 
మరిన్ని వార్తలు