'జవాన్ల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తాం'

3 Nov, 2016 17:48 IST|Sakshi
'జవాన్ల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తాం'

బుద్గాం: కేవలం ఒక లక్ష మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు మాత్రమే వన్ ర్యాంక్-వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) అమలులో సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం తెలిపారు. పథకం అమలులో సమస్యలను రెండు నెలల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. పట్టణంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మొత్తం 20 లక్షల మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగుల్లో లక్ష మంది ఉద్యోగుల పత్రాల్లో సాంకేతికంగా తేడాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

పరీకర్ తో పాటు భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరువురు 1947లో పాక్ రైడర్ల నుంచి శ్రీనగర్ ఎయిర్ పోర్టును రక్షించిన భారత మొదటి పరమ వీర చక్ర అవార్డు గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ, జవానులకు నివాళులు అర్పించారు. గత 43ఏళ్లుగా అమలుకు నోచుకోని ఓఆర్ఓపీ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగివుందని అన్నారు. ప్రస్తుతం 23 నుంచి 24 శాతం పెరిగిన పెన్షన్ ను జవానులు అందుకుంటున్నట్లు చెప్పారు. జవానుల బాధలు విన్న పరీకర్ వాటన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాను విన్న సమస్యలకు తన తర్వాత పర్యటనలో పరిష్కారం అవుతాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు