సొంత రాష్ట్రానికే రావడం నా అదృష్టం

30 Oct, 2015 01:32 IST|Sakshi
సొంత రాష్ట్రానికే రావడం నా అదృష్టం

సాక్షి’తో ట్రైనీ ఐపీఎస్ అపూర్వరావు
తెలంగాణలో సొంత రాష్ట్ర కేడర్‌కు ఎంపికైన మహిళ
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారిణిగా సొంత రాష్ట్రానికే సేవలందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని ట్రైనీ ఐపీఎస్ కె.అపూర్వరావు చెప్పారు. ఈనెల 31న పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం రాష్ట్రానికి సేవలందించేందుకు సిద్ధమవుతున్న యువ మహిళా ఐపీఎస్ గురువారం జాతీయ పోలీసు అకాడమీలో ‘సాక్షి’తో మాట్లాడారు. సివిల్ సర్వీస్ 2013 బ్యాచ్‌కు చెందిన 141 మందితో కలిపి ఆమె శిక్షణ పొందారు.

ఆమెతో పాటు రాహుల్ హెగ్డే, బి.కె.సునీల్ దత్‌ను తెలంగాణకుకేటాయించారు. హైదరారాబాద్ బేగంబజార్‌కు చెందిన అపూర్వరావు సివిల్ సర్వీసులో 500పై చిలుకు ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సొంత రాష్ట్ర కేడర్‌కు ఎంపికైన తొలి మహిళ అపూర్వరావు.
 
అన్ని రంగాల్లో మహిళలు
‘పోలీసు శాఖలో మహిళలు ఎక్కువగా చేరడానికి అంతగా ఆసక్తి చూపరనేది గతం. ప్రస్తుతం రోజులు మారాయి. మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మా బ్యాచ్‌లో 26 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య గతంతో పోల్చితే ఎక్కువే. ఇక నా విషయానికొస్తే ఐపీఎస్ అవుతానంటే కుటుంబసభ్యులెవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా అమ్మానాన్నలు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. వారి సహకారం వల్లే తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించగలిగా’ అని అపూర్వరావు ఆనందంగా చెప్పారు. ‘ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత ట్రైనింగ్‌కు సంబంధించి మొదట్లో కాస్త కంగారుపడ్డాను.

కానీ నేను ఎంతో అభిమానించిన వృత్తి కావడంతో శిక్షణలో ప్రతి రోజూ నూతనోత్సాహంతో నేర్చుకున్నా. ఇది సవాళ్లను ఎదుర్కోగల ధైర్యాన్నివ్వడంతో పాటు పోలీసింగ్‌పై ఎన్నో మెళకువలను నేర్పింది. ఇప్పటి దాకా కేవలం వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్న నేరాలను మాత్రమే చూశాం. కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు సమాజంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. వెబ్‌సైట్లు ఎలా హాక్ అవుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ అకృత్యాలను నివారించేందుకు ఓ కామన్ సాఫ్ట్‌వేర్ ఉండాలన్నది నా అభిప్రాయం. ఆర్‌బీఐ గవర్నర్ రఘురాంరాజన్ వంటి నిపుణులు ఇచ్చిన ప్రత్యేక ప్రసంగాలు మాలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి. వారిచ్చిన స్ఫూర్తితో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తా’ అని ఆమె వివరించారు.

మరిన్ని వార్తలు