పుల్లూరు బండలో పురాతన చరిత్ర

17 Sep, 2015 02:36 IST|Sakshi
పుల్లూరు బండలో పురాతన చరిత్ర

సాక్షి, హైదరాబాద్: ‘మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూరు బండ గ్రామ శివార్లలో దాదాపు రెండు నెలల పాటు పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో అత్యంత విలువైన ఆధారాలు లభించాయి... ఇక్కడి సమాధుల్లో అతిపురాతన అస్తిపంజరం లభించింది. ఇలా పూర్తి అస్తిపంజరం లభించడం అరుదు... అది ఎన్నేళ్లనాటిదనే కచ్చితత్వం కోసం దాన్ని సీసీఎంబీకి పంపాలని నిర్ణయించాం’ అని తెలంగాణ పర్యాటక, పురావస్తుశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. బుధవారం పురావస్తుశాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ సునీతాభగవత్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

పుల్లూరుబండ తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు లభించాయని, ఇవన్నీ తమ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడనున్నాయన్నారు. అతి పురాతన ఆంథ్రోమార్ఫిక్ ఫిగర్ కూడా లభించిందని, ఆదిమానవులు నాటి వ్యక్తులకు గుర్తుగా మానవాకృతిగా రాతిని మలిచేవారని, అలాంటి ఆధారాలు లభ్యమవడం అత్యంత అరుదని చెప్పారు. వరంగల్ జిల్లాలో వెలుగుచూసిన మైలారం గుహలను అభివృద్ధి చేయనున్నామని, 15 కిలోమీటర్ల మేర విస్తరించిన ఇవి ప్రపంచంలోనే పెద్ద గుహల్లో ఒకటిగా చరిత్రకెక్కుతాయన్నారు.

బిహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత బౌద్ధ జాడలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనేనని, కేంద్రం నుంచి ప్రత్యేక బౌద్ధ సర్క్యూట్ అభివృద్ధి కోసం నిధులు పొంది ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధ జాడలతో సంయుక్తంగా పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి చేస్తే దేశంలో ప్రధాన పర్యాటక ప్రాంతాలుగా మారుతాయని అభిప్రాయపడ్డారు.
 త్వరలో పదవీ విరమణ చేయనున్న తమిళనాడు పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్నన్ సేవలను తెలంగాణలో చారిత్రక ప్రాంతాల పురోగతికి వినియోగించుకునే ఆలోచనలో ఉన్నామని వెంకటేశం వెల్లడించారు.

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లెపల్లెలో కృష్ణవేణి అనే విద్యార్థినికి లభించిన తాళపత్ర గ్రంథంలో బైండ్ల మగ్గ మాయ చరిత్రకు సంబంధించిన పంచకథలున్నట్టు తెలిపారు.  ఖమ్మం జిల్లా గార్ల బయ్యారంలో కృష్ణదేవరాయ, అచ్యుతరాయ కాలం నాటి 40 బంగారు నాణేలు దొరికాయని, నాణేలపై బాలకృష్ణుడి చిత్రం మరోవైపు నగరి లిపిలో శ్రీప్రతాప కృష్ణరాయ అన్న అక్షరాలున్నాయని, మిగతా నాణేలపై ఒకవైపు గండబేరుండం చిత్రం మరోవైపు నగరి లిపిలో శ్రీ ప్రతాపాచ్యుతరాయ అని అక్షరాలున్నాయన్నారు. ఇలాంటి నాణేలు దొరికితే ప్రభుత్వానికి అందజేయాలని, లేనిపక్షంలో నేరమవుతుందని వెంకటేశం తెలిపారు. ఇప్పటి వరకు లభించిన నాణేలతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు