పుణెలో తెలుగు టెకీ ఆత్మహత్య

14 Jul, 2017 03:58 IST|Sakshi
మృతుడు దుర్గాప్రసాద్‌ (ఫైల్‌)

- ఐటీ ఉద్యోగానికి భద్రత లేదని సూసైడ్‌ నోట్‌
- ఆపై ఆరో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణం
- మృతుడు దుర్గాప్రసాద్‌ది కృష్ణా జిల్లా.. మూడ్రోజుల కిందటే జాబ్‌లో చేరిక


పుణె:
‘‘ఐటీలో ఉద్యోగానికి భద్రత లేదు.. భవిష్యత్తు గురించి భయపడ్డా.. నా కుటుం బం గురించి ఆందోళన చెందుతున్నా. వారిని బాగా చూసుకోండి.. క్షమించండి. లవ్యూ ఆల్‌. గుడ్‌బై..’’అని సూసైడ్‌ నోట్‌లో రాసి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రాణాలు తీసుకున్నాడు. పుణెలో జాబ్‌లో చేరిన మూడోరోజులకే హోటల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనను కృష్ణా జిల్లాకు చెంది న గోపీకృష్ణ దుర్గాప్రసాద్‌(25)గా గుర్తిం చారు.

గతంలో హైదరాబాద్, ఢిల్లీలోని సాఫ్ట్‌ వేర్‌ సంస్థల్లో పనిచేసిన ఆయన.. ఈ నెల 9న పుణెలోని ఓ ఐటీ కంపెనీలో విధుల్లో చేరాడు. విమాన్‌నగర్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఆయనకు ఆ కంపెనీ వసతి ఏర్పాటు చేసింది. అయితే ఐటీ ఉద్యోగానికి భద్రత లేదని ఆవేదన చెందిన దుర్గాప్రసాద్‌ బుధవారం రాత్రి చేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అది విఫలమ వడంతో గురువారం తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో హోటల్‌ భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే హోటల్‌ మేనేజర్‌కు సమాచారమిచ్చారు. అతడు పోలీసులకు సమాచారమిచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దుర్గాప్రసాద్‌ చాలా మంచివాడని, ఎలాంటి చెడు అలవాట్లు లేవని పుణెలో పనిచేస్తున్న ఆయన బంధువులు పేర్కొన్నారు.
(చదవండి: సాఫ్ట్‌వేర్‌ కొలువులపై మెత్తని కత్తి)

మరిన్ని వార్తలు