నాకు తెలియకుండానే ఆ వీడియో తీశాడు!

4 Sep, 2016 11:38 IST|Sakshi
నాకు తెలియకుండానే ఆ వీడియో తీశాడు!

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, బహిష్కృత ఆప్‌ నేత సందీప్‌కుమార్‌ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి, తన జీవితాన్ని నాశనం చేశారని, ఆయనను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ పోలీసులను కోరింది. వివాదాస్పద సీడీలో సందీప్‌కుమార్‌తో కలిసి సన్నిహితంగా కనిపించిన ఆమె తాజాగా పోలీసులకు వీడియో స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇద్దరు మహిళలతో సందీప్‌కుమార్‌ రాసలీలలు నెరుపుతున్న వీడియో సీడీలు వెలుగుచూడటంతో ఆయనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పోలీసులు సందీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని లైంగికదాడి అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చింది.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. '11 నెలల కిందట నేను సందీప్‌కుమార్‌ను మార్కెట్‌లో కలిశాను. నాకు రేషన్‌ కార్డు ఇప్పించేందుకు సహాయం చేయమని కోరాను. నాకు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పత్రాలు తీసుకొని ఒంటరిగా తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఆ తర్వాత నన్ను తన ఇంటికి పిలిచారు. ఇంటికి వెళ్వాక ఓ గదిలో వేచి ఉండమని చెప్పారు. ఆ తర్వాత నాకు మత్తుపదార్థాలు కలిపిని పానీయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు' అని బాధితురాలు తెలిపింది. అనంతరం తనపై సందీప్‌కుమార్‌ అత్యాచారం జరిపారని, మర్నాడు ఉదయం తనను ఇంటినుంచి పంపించాడని ఆమె పోలీసులకు చెప్పింది.

'తనను సందీప్‌ వీడియో తీస్తున్నాడనే విషయం ఆమెకు తెలియదు. మత్తులో ఉన్న ఆమెకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆమెను ట్రాప్‌ చేసి అతను వాడుకున్నాడు' అని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా ఎందుకు చేశావని ఆమె మర్నాడు ఉదయం సందీప్‌ను నిలదీసిందని, ఇలా చేయడం వల్ల తన పెళ్లిపై ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసిందని వారు చెప్పారు. 'రేషన్‌ కార్డు కావాలంటే నువ్వు లొంగిపోక తప్పదు అని సందీప్‌ చెప్పాడు. నీ పెళ్లి దెబ్బతీనకుండా ఉండాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు అని ఆమెను బెదిరించాడు' అని పోలీసులు వివరించారు. తనను మోసం చేసిన సందీప్‌ చివరకు రేషన్‌ కార్డు కూడా ఇప్పించలేదని, అవమానభారంతో తాము మరో ఇంటికి మారామని బాధితురాలు తెలిపింది. 'నేను పేద మహిళను. వివాహితను. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి వ్యతిరేకంగా పోరాడే వనరులు నా వద్ద లేవు. బహిరంగంగా వీడియో లీక్‌ చేసి అతను నా పరువుకు భంగం కలిగించాడు. ఇందంతా తెలిశాక నన్ను సమాజం ఒప్పుకోద్దు. ఇందుకు బాధ్యుడైన అతన్ని కఠినంగా శిక్షించాలి' అని బాధితురాలు కోరింది.
 

>
మరిన్ని వార్తలు