ఆప్ నేత వద్దకు అమ్మాయి ఫొటో కోసం వెళ్తే..

12 Sep, 2016 16:53 IST|Sakshi
ఆప్ నేత వద్దకు అమ్మాయి ఫొటో కోసం వెళ్తే..

చండీగఢ్: వరుస వివాదాలు, కేసులు, తీవ్ర ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. వివాదాల్లో కూరుకుపోతున్న ఆప్ నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని, పార్టీ నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు అరెస్ట్ కాగా, మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్లోనూ ఆప్కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ టికెట్ పొందిన దేవ్ మనే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించగా, తాజాగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సన్నిహితుడిగా భావిస్తున్న విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. ప్రస్తుతం హర్దీప్ పరారీలో ఉన్నాడు.

సంగూర్కు చెందిన హర్దీప్ తనపై లైంగికదాడికి యత్నించినట్టు ఓ మైనర్ దళిత బాలిక ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంగూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితురాలు తన చెల్లెలితో కలసి పాస్ పోర్టు సైజు ఫొటోలు తీయించుకునేందుకు హర్దీప్ స్టూడియోకు వెళ్లగా.. హర్దీప్ డార్క్ రూమ్లో ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.ఆమె గట్టిగా అరవడంతో ఆయన అక్కడి నుంచి బయటకుపారిపోయాడు. ఆప్ నేతలు హర్దీప్పై ఇప్పటివరకు ఎలాంటి చర‍్యలూ తీసుకోలేదు. కేజ్రీవాల్ గత ఫిబ్రవరిలో హర్దీప్ గ్రామానికి వెళ్లారు. ఆప్ అగ్రనేతలు కొందరు ఆయన ఇంట్లో బసచేశారు. కేజ్రీవాల్తో హర్దీప్ దిగిన ఫొటో బయటకు రావడంతో ఆప్లో దుమారం రేపుతోంది. పంజాబ్లో ఆప్ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసింది. దీనికి తోడు తాజా కేసులు ఆప్కు ఇబ్బందికరంగా మారాయి.

మరిన్ని వార్తలు