ఆయనొక ఐకాన్, ఆయన గళమే ఆయుధం

28 Jan, 2017 18:16 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆయన దళిత ప్రజలకు ఓ ఐకాన్‌. ఆయన గళమే ఆయన ఆయుధం. ఆయన ప్రసంగించినా, పాట పాడినా ప్రజల గుండెల్లోకి సూటిగా దూసుకుపోతుంది. సుతిమెత్తగా హదయాన్ని తగులుతుంది. అణచివేస్తున్న వర్గాలపై తిరగబడమని తరుముతుంది. వర్గ శత్రువుల రక్తనాళాల్లో కల్లోలం రేపుతుంది. వారి ధమనుల్లో భయోత్పాతాన్ని సస్టిస్తుంది. ఆయనే భంత్‌ సింగ్‌.

1965లో పంజాబ్‌లోని ఓ దళిత కుటుంబంలో పుట్టిన భంత్‌ సింగ్‌ చదువుకోలేదు. కానీ ఉడుకురక్తం ఉరకలేస్తున్న వయస్సులోనే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 12వ ఏటనే పాటందుకున్నారు. సీపీఐ (ఎంఎల్‌)లో చేరి సమాజంలో దళితుల తరఫున, అణగారిన వర్గాల తరఫున పోరాటం ప్రారంభించారు. ఆయన పేరు చెబితేనే దడుసుకునే అగ్రవర్గాల యువకులు ఓ రోజున ఆయన్ని కిడ్నాప్‌చేసి కాళ్లపైనా, చేతులపై తీవ్రంగా కొట్టారు. పర్యవసానంగా రెండు చేతులు, ఒక కాలును తీసివేయాల్సి వచ్చింది. రెండో కాలు చూపుకే ఉందికాని అది కూడా చచ్చుపడిపోయింది. పెళ్లి నిశ్చయమైన కూతురును అగ్రవర్ణాలకు చెందిన కామాంధులు గ్యాంగ్‌ రేప్‌ చేస్తే కూతురు తరఫున కోర్టులో న్యాయపోరాటం జరిపి దోషులకు శిక్ష పడేలా చేసినందుకు, దళిత స్త్రీల శీలాన్ని కాపాడేందుకు ప్రయత్నించినందుకు అగ్రవర్ణాల వారు ఆయనకు ఈ దారుణ శిక్ష విధించారు. కాళ్లు, చేతులు పోయినా ఆయన గొంతును మాత్రం శత్రువులు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ గొంతే ఆయనకు ఆయుధం.

ఆప్‌ తరఫున ప్రచారం

చిన్నప్పటి నుంచి సీపీఐ(ఎంఎల్‌) పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసిన భంత్‌ సింగ్‌ ఇటీవలనే ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా పంజాబ్‌ ఎన్నికల్లో విస్తత ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో ఉన్న 32 శాతం దళితులను ఏకం చేసేందుకు కషి చేస్తున్నారు. తాను ఇన్నాళ్లు నమ్ముకున్న సీపీఐ (ఎంఎల్‌) పార్టీ ఎన్నేళ్లు నిరీక్షించినా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, పైగా ప్రస్తుతం ఆ పార్టీలో కూడా అగ్రవర్ణాల ఆదిపత్యమే కొనసాగుతుందన్న కారణంగా ఆయన పార్టీ మారారు.

ఆప్‌లో చేరిన రోజు

భంత్‌సింగ్‌ ఆప్‌లో చేరిన రోజు ఆయనకు జీవితంలో ఊహించని అనుభవం ఎదురైంది. తన కూతురుని సామూహికంగా రేప్‌ చేసి జైలు కెళ్లిన జాట్‌ యువకులు ఆ రోజున ఆ వేదికను అలంకరించి ఉన్నారు. అందుకు ఆశ్చర్యపోయిన భంత్‌ సింగ్, ఆప్‌లో చేరుతున్నట్లు ప్రకటించి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత పది నిమిషాలకు పార్టీ పంజాబ్‌ ఇంచార్జి నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. కూతురును రేప్‌ చేసిన దోషుల గురించి అప్పుడే తమకు తెల్సిందని, వారిని పార్టీ నుంచి తొలగిస్తున్నామన్నది ఆ ఫోన్‌ సారాంశం. స్థానిక రాజకీయ నాయకుల వల్ల దోషులు తమ పార్టీలోకి వచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఆయన్ని ఆ తర్వాత స్వయంగా కలసుకొని క్షమాపణలు కోరారు. పార్టీ నుంచి ఆ దుర్మార్గులను తొలగించినట్లు చెప్పారు.

కూతురుపై గ్యాంగ్‌ రేప్‌

 2002, జూలై 6వ తేదీన ఆయన కూతురు బలిజిత్‌ను మన్సా జిల్లా బుర్జ్‌ జబ్బర్‌ గ్రామంలో జాట్‌ వర్గానికి చెందిన యువకులు రేప్‌ చేశారు. 2006, జనవరి 5వ తేదీన ఆయన్ని దారికాచి కాళ్లు, చేతులు పోయేలా బండరాళ్లతో బాదింది కూడా జాట్‌ కులానికి చెందిన యువకులే. దళిత స్త్రీలు స్నానాలు చేసే చోట బాల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టును ఏర్పాటు చేసుకొని ఆడుతున్న ఆ యువకులను మరోచోటుకి ఆటను మార్చుకోవాల్సిందిగా కోరినందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ రోజు రాత్రి వారు భంత్‌సింగ్‌ దారికాచి పట్టుకున్నారు. ఊరువెలుపలున్న చెరువు గట్టుకు తీసుకెళ్లి, సిమ్మెంట్‌ గట్టుపై రెండు చేతులు ఆనిచ్చి ‘మమ్మల్ని ఆట చోటును మార్చుకోమని అడుగుతావా? నీకు ఎంత ధైర్యం రా’ అంటూ వాళ్లు బండరాళ్లతో బాదారు. ఆ తర్వాత కాళ్లను కూడా సిమ్మెంట్‌ గట్టుపై పెట్టి అలాగే బాదారు. ప్రాణాపాయ స్థితిలో ఆయన్ని వదిలేసిన కుర్రవాళ్లే ఆయన్ని ఎవరో కొట్టి పడేశారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆయన్ని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు రక్షించేందుకు చేతులు, కాలు తీసివేయాల్సి వచ్చింది.

ఆ పార్టీలోనూ వారి పెత్తనమే

తనకు ఓ జాట్‌ కులస్థుడితో ఇంటి స్థలం తగాదా వచ్చిందని, ఆ విషయమై పార్టీ (సీపీఐ–ఎంఎల్‌) సహాయం కోరానని, ఆ పార్టీలో కూడా జాట్‌ కులస్థులదే పెత్తనం నడుస్తుండడం వల్ల తనకు న్యాయం జరగలేదని, ఆ పార్టీలో ఎంతకాలం కొనసాగినా ఇక ఇంతే అనుకొని బయటకు వచ్చానని భంత్‌ సింగ్‌ తెలిపారు. ఢిల్లీలో అరవింద్‌ కేజ్రివాల్‌ చేస్తున్న మంచి పనులను చూసి ఆప్‌ వైపు ఆకర్షితుడినయ్యానని చెప్పారు. దళిత ఐకాన్‌గా మారిన భంత్‌ సింగ్‌ ఎన్నికల ప్రచారం ఆప్‌ విజయావకాశాలపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు