బద్ధశత్రువుల కలయికతో కొత్త ప్రపంచం?

15 Nov, 2016 10:22 IST|Sakshi
బద్ధశత్రువుల కలయికతో కొత్త ప్రపంచం?

మాస్కో/వాషింగ్టన్‌: ​ఒక దేశం సంక్షోభంలో చిక్కుకుందంటే దానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా(+మిత్రదేశాలు), రష్యాలు కారణమవుతాయన్న సంగతి చెప్పనక్కర్లేదు. ఆధిపత్యభావజాలం, ఆయిల్‌​ నిక్షేపాలు, ఆయుధాల వ్యాపారం.. లాంటి ఎన్నో దారుల్లో అగ్రరాజ్యాలు ఆయా దేశాల్లో కల్లోలం రేపుతాయని తెలిసిందే. అలా పెరిగి పెద్దదై, నాగరికతకు, మానవత్వానికి మాయని మచ్చలా తయారైందే సిరియా సంక్షోభం. ఒక్క సిరియానేకాదు మిడిల్‌​ ఈస్ట్‌ లోని చాలా దేశాలు, ఆఫ్రికాలోని అన్నిదేశాలు, మిగతా ప్రపంచంలో కొన్నిదేశాల్లో నెలకొన్న పరిస్థితి వింటే మనిషన్న ఎవరికైనా బాధకలగకమానదు.

ఇలాంటి స్థితిలో ప్రయోజనాలు పక్కనపెట్టి, ప్రపంచశాంతి కోసం పాటుపడటం అనే ప్రక్రియను అగ్రరాజ్యాలు మొదలుపెడతాయా? అంటే కష్టమనే చెప్పొచ్చు. కార్పొరేట్‌ సమీకరణాల నడుమ అభివృద్ధి చెందిన ఏ దేశమూ ఆ పని చేయదు. కానీ శాంతి నెలకొనాలని మనం అభిలాషించాల్సిందే. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ల తాజా చర్చలు ఆ ఆశలను కొద్దిగా రేకెత్తిస్తున్నాయి. పుతిన్‌ మొదటి నుంచి ట్రంప్‌ కు మద్దతిస్తున్నట్లు వార్తలు వింటున్నాం. అయితే అమెరికా-రష్యాల అధినేతలుగా మాత్రం వాళ్లు ప్రస్తుతానికి బద్ధ శత్రువులే!

రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌ సోమవారం అమెరికా ప్రెసిడెంట్‌​ ఎలెక్ట్‌ డోనాల్ట్‌ ట్రంప్‌ కు ఫోన్‌ చేసి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు తెలపడంతోపాటు సిరియా సంక్షోభం, అమెరికా-రష్యాల ద్వైపాక్షిక సంబంధాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఇరుదేశాల సంబంధాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకుని సాధారణ స్థితికి తీసుకురావడం, సిరియా సంక్షోభానికి ముగింపు పలకండం లాంటి కీలక అంశాలపై ఇరునేతలు చర్చించినట్లు క్రెమ్లిన్‌(రష్యా అధికార కేంద్రం), ట్రంప్‌ కార్యాలయాలు మీడియాకు వెల్లడించాయి. సత్సంబధాల పునరుద్ధరణలో భాగంగా వాషింగ్టన్‌​, మాస్కోల మద్య నిరంతర సంవాదాలు, తరచూ ఇరుదేశాధ్యక్షుల పర్యటనలు కొనసాగాలని పుతిన్‌, ట్రంప్‌ లు నిర్ణయించారని, ఈ ప్రక్రియలో ఎలాంటి భేషజాలకు తావు ఇవ్వకూడదని నేతలు భావిస్తున్నట్లు వారి ప్రతినిధులు పేర్కొన్నారు.

200 ఏళ్లకు పైగా కొనసాగుతోన్న అమెరికా- రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో త్వరలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. వచ్చే ఏడాదితో యూఎస్‌-రష్యా బంధం 210వ వార్షికోత్సవం జరగనుంది. ఇంకా ఖారారుకాని ఈ వేదికపైనుంచి పుతిన్‌, ట్రంప్‌ లు కొత్త ఒరవడికి శ్రీకారం చుడతారని, ఆ మేరకు మార్గనిర్దేశం చేస్తారని తెలిసింది. సమానత్వం, పరస్పర గౌరవం, ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు కలుగజేసుకోకుండా ఉండటం తదితర అంశాల ప్రాతిపదికన ఇద్దరు నేతలు చర్చలు జరుపుతారని క్రెమ్లిన్‌ వర్గాలు ప్రకటించగా, ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసి పోరాడుదామని ట్రంప్‌ పేర్కొన్నట్లు వాషింగ్టన్‌ లోని ఆయన కార్యాలయం తెలిపింది.
అయ్యో.. సిరియా
సిరియాలో అధికార బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 1000 గ్రూపులు పనిచేస్తున్నాయి. ఐసిస్‌ ఆ వెయ్యిలో ఒకటి. ఎన్నికల ప్రచారంలో ‘ఐసిస్ ను సృష్టించింది ఒబామా, హిల్లరీలే’నన్న ట్రంప్‌ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని, అసద్‌ కు రష్యా దన్నుగా నిలవడంతో తన ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న భయంతోనే అమెరికా రెబల్‌ గ్రూపులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరాచేసిందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతారరు. అసద్‌ కు మద్దతిస్తోన్న రష్యా కూడా వైమానిక దాడులతో సిరియాలో ఘోర విధ్వంసాలకు పాల్పడింది.

ఎవరి ప్రయోజనాల కోసం వాళ్లు బరితెగించడంతో దాదాపు రెండు కోట్ల మంది సిరియన్ల బతుకులు కకావికలం అయ్యాయి. నాలుగేళ్లుగా ఉధృతంగా సాగుతోన్న యుద్ధం కారణంగా ఇప్పటికే 50 లక్షల పైచిలుకు సిరియన్లు సోంతదేశాన్ని విడిచచి శరణార్థులుగా వెళ్లిపోయారు. అలా వెళుతూ వెళుతూ సముద్రంలో మునిగి చనిపోయిన బాలుడు అయిలన్‌ కుర్ధీ ఫొటో ప్రపంచాన్ని ఎంతగా కదిలించిందో చూశాం. ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా, పుతిన్‌ సారధ్యంలోని రష్యాలు సిరియా సంక్షోభానికి ముగింపు పలికి, మున్ముందు ఇలాంటి దురాక్రమణలకు ఉపక్రమించకుండా ఉంటే ప్రపంచానికి కావాల్సిందేముంటుంది?

>
మరిన్ని వార్తలు