సింధు మ్యాచ్‌.. సెన్సేషనల్‌ హిట్‌!

30 Aug, 2016 15:44 IST|Sakshi
సింధు మ్యాచ్‌.. సెన్సేషనల్‌ హిట్‌!

రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు అసమాన పోరాటం దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఆమె ఫైనల్‌ మ్యాచ్‌.. దేశ ప్రజలను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.

ప్రపంచ నంబర్‌, స్పెయిన్‌ షట్లర్‌ కరోలినా మారిన్‌తో సింధు తలపడిన రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఏకంగా భారత్‌లో 6.65 కోట్లమంది చూశారు. భారత్‌ పరంగా చూసుకుంటే రియో ఒలింపిక్స్‌లో అత్యధికులు చూసిన సింగిల్‌ మ్యాచ్‌ ఇదే. అంతేకాదు దేశంలో అత్యంత పాపులర్‌ అయిన 'ద కపిల్‌ శర్మ షో' వంటివాటిని సింధు ఫైనల్‌ మ్యాచ్‌ అధిగమించడం విశేషం. 'ద కపిల్‌ శర్మ షో'ను ప్రతివారం ఐదు కోట్ల మంది వీక్షిస్తుండగా సింధు ఫైనల్‌ మ్యాచ్‌ను ఏకంగా 6.65 కోట్లమంది వీక్షించారని మీడియా రీసెర్చ్‌ సంస్థ జపర్‌ తెలిపింది.

రియో ఒలింపిక్స్‌లో సింధు ఆడుతున్న మ్యాచ్‌లకు క్రమంగా వ్యూయర్‌షిప్‌ పెరిగింది. మొదట ఆమె మ్యాచ్‌లకు 16.4 మిలియన్ల వ్యూయర్‌షిప్‌ ఉండగా.. ఫైనల్‌ మ్యాచ్‌కు వచ్చేసరికి అది అమాంతం పెరిగిపోయింది. ఇక, ఆమె సెమీఫైనల్‌ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన ప్రేక్షకుల్లో 57.4శాతం మంది ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. సింధు ప్రతిభ మీద ఉన్న అపారమైన నమ్మకమే ఆమె ఫైనల్‌ మ్యాచ్‌ను లైవ్‌లో చూసేందుకు చాలామందిని ప్రోత్సహించినట్టు నిపుణులు చెప్తున్నారు.

హైదరాబాద్‌లో రికార్డు వ్యూయర్‌షిప్
పీవీ సింధుకు స్వస్థలం హైదరాబాద్‌ నుంచి భారీ మద్దతు లభించినట్టు టీవీ వ్యూయర్‌షిప్‌ స్పష్టం చేస్తున్నది. దేశంలో ముంబై తర్వాత అత్యధికంగా సింధు మ్యాచ్‌ను చూసింది హైదరాబాదీలే. నగరాల  వ్యూయర్‌షిప్‌ విషయంలో ముంబై ప్రథమస్థానంలో ఉంటే హైదరాబాద్‌ ద్వితీయ స్థానంలో ఉంది. బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్ కౌన్సిల్‌ (బార్క్‌) వివరాల ప్రకారం రెండువారాలపాటు జరిగిన రియో ఒలింపిక్స్‌ను దేశంలో తొమ్మిది చానెళ్లలో 22.8 కోట్లమంది వీక్షించారు.

మరిన్ని వార్తలు