ప్రధాని మోదీ ఇంటి అడ్రస్ మారనుందా?

20 Sep, 2016 20:14 IST|Sakshi
7రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసం(ఇన్ సెట్:మోదీ, మీనాక్షి లేఖి)

కొన్ని చిరునామాలు అప్రయత్నంగానే బండగుర్తుల్లా  గుర్తుండిపోతాయి. 1600, పెన్సిల్వేనియా ఎవెన్యూ ఎన్డబ్ల్యూ, వాషింగ్టన్ డీసీ.. చిరునామా వినగానే అమెరికన్లకు అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ గుర్తొస్తుంది. ఇక ఇండియాలో రాజకీయపరంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తి నివాసం ఎక్కడంటే.. '7 రేస్ కోర్స్ రోడ్, న్యూఢిల్లీ' అని ఠక్కున చెప్పేస్తాం. భారత ప్రధానమంత్రి అధికారిక నివాసం అది. ప్రస్తుతం ఆ ఇంట్లో నరేంద్ర మోదీ నివసిస్తున్నారు. అయితే ఇటీవల వెల్లువెత్తుతున్న డిమాండ్ల నేపథ్యంలో మోదీగారి ఇంటి అడ్రస్ మారిపోనుందనే భావన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే..

రేస్ కోర్స్ అనే పదం భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధంలేనిదని, వలస కాలం నాటి ఆ పేరును తొలిగించి 'ఏకాత్మ మార్గ్'అని పెట్టాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆమె ఈ మేరకు న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ)లో ప్రతిపాదన చేశారు. బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ బావజాలం ఏకాత్మ మానవ దర్శన్ (integral humanism)ను సూచించేలా రేస్ కోర్స్ రోడ్డును 'ఏకాత్మ మార్గ్'గా మార్చాలని ఆమె ప్రతిపాదించారు.

కాగా, ఎన్డీఎంసీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు మాత్రం పేరు మార్పునకు అంగీకరిస్తూనే ఆర్ఎస్ఎస్ సంబంధిత వ్యక్తులవి కాకుండా అమరజవాన్లలో ఒకరి పేరు పెట్టాలని అంటున్నారు. 1965 యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ నిర్మల్జిత్ సింగ్ పేరును ఆప్ ఎమ్మెల్యే సూచించారు. ఈ విషయంపై కౌన్సిల్ తుది తీసుకోలేదు. ఒకవేళ పేరుమార్పునకు ఓకే చెప్పినా ఇప్పటికే ఇలాంటి మార్పుల వల్ల తలెత్తిన విమర్శల నేపథ్యంలో కేంద్ర పునరాలోచించే అవకాశం లేకపోలేదు. గతంలో ఔరంగజేబ్ రోడ్డును ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చిన సందర్భంగా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు