ముస్లిం అనుకుని భారతీయుడిపై దాడి

18 Mar, 2017 17:43 IST|Sakshi
దాడికి పాల్పడిన వ్యక్తి జెఫ్రీ అల్లెన్ బర్గీస్

వాషింగ్టన్: అమెరికాలో మరో జాతి విద్వేష దాడి ఆలస్యంగా వెలుగుచూసింది. గతేడాది నవంబర్ లో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన కొన్నిరోజులకే భారత సంతతికి చెందిన అంకుర్ మోహతాపై ఓ అమెరికన్ వ్యక్తి జాతి విద్వేష దాడికి పాల‍్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచాడు. ఈ కేసు తాజాగా విచారణకు రాగా, పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.. జెఫ్రీ అల్లెన్ బర్గీస్(54) అనే పెన్సిల్వేనియాకు చెందిన వ్యక్తి సౌత్ హిల్స్ లో గత నవంబర్ 22న రెడ్ రాబిన్ రెస్టారెంట్ కు వెళ్లాడు. అంకుర్ మోహతా అదే రెస్టారెంట్ కు వచ్చి బర్గీస్ పక్క సీట్లో కూర్చున్నాడు.

అంకుర్ మెహతాను చూసి ముస్లిం అనుకుని పొరబడిన బర్గీస్ అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. మెహతా తన పని తాను చూసుకుంటున్నా.. బర్గీస్ తీరు మారలేదు. ముస్లింలు ఇక్కడ ఉండరాదు.. మీకు ఇక్కడే పని అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఆపై మెహతాపై పదునైన వస్తువుతో దాడిచేశాడు. దీంతో మెహతా ఓ దంతం ఊడిపోయిందని, రక్తం కారుతున్న ఆయనను సెయింట్ క్లేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

జాతి విద్వేష దాడిపై బెథల్ పార్క్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా.. అంకుర్ మెహతాను బర్గీస్ దూషిస్తూ కొట్టడం చూసినట్లు ప్రత్యక్షసాక్షులు పోలీసులకు చెప్పారు. పెన్సిల్వేనియా అసిస్టెంట్ అటార్నీ జనరల్ టామ్ వీలర్ మాట్లాడుతూ.. బర్గీస్ తప్పుచేశాడని.. ఉద్దేశపూర్వకంగానే జాతి విద్వేష దాడి చేసినట్లు తేలిందన్నారు. జాతి విద్వేషదాడికి పాల్పడిన బర్గీస్ కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షతో పాటు 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు