కోతలు లేని ఆర్‌బీఐ చేతల్లో బ్యాంకులు

8 Apr, 2015 00:13 IST|Sakshi
కోతలు లేని ఆర్‌బీఐ చేతల్లో బ్యాంకులు

పాలసీ రేట్లు మార్చని ఆర్‌బీఐ
 బ్యాంకులు తగ్గించకపోవడం నాన్సెన్స్
 అన్న రఘురామ్ రాజన్
 ఇప్పుడే సాధ్యంకాదంటూ తొలుత
 బ్యాంకర్ల సన్నాయి నొక్కులు
 తర్వాత నాటకీయంగా బేస్ రేటు తగ్గించిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ

 
 ముంబై: రిజర్వుబ్యాంక్ గవర్నర్ ‘నాన్సెన్స్’ హెచ్చరిక పనిచేసినట్లుంది. మంగళవారంనాటి తాజా పాలసీ సమీక్షలో రఘురామ్‌రాజన్ కోతలకు నో చెప్పినా, బ్యాంకులు మాత్రం యస్ అన్నాయి. గత మూడు నెలల్లో రెండు దఫాలు పావుశాతం చొప్పున ఆర్‌బీఐ తగ్గించిన రెపో రేటు ఫలితాన్ని వినియోగదారులకు బ్యాంకులు మళ్లించకపోవడంతో రాజన్ విరుచుకుపడిన వెంటనే బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వాటి బేస్ రేటును నాటకీయంగా తగ్గించాయి. కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పేదీ చేయకపోయినా, బ్యాంకులు రేట్లను తగ్గించడం విశేషం.
 
 ఎక్కడి రేట్లు అక్కడే...

 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళవారం నిర్వహించిన తన మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు. ప్రస్తుత రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై పారిశ్రామిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ఏడాది చోటుచేసుకున్న రెండు దఫాల కీలక రేట్ల తగ్గింపూ పాలసీ సమీక్ష సందర్భంగా కాకపోవడం ఇక్కడ గమనార్హం.
 
  ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 7.5 శాతంగా కొనసాగనుంది. రివర్స్ రెపో రేటు (బ్యాంకులు స్వల్పకాలికంగా తన వద్ద ఉంచే నిధులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటు) 6.5 శాతంగానే ఉంటుంది. ఇక బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగుతుంది. ఇక స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన పరిమాణం) యథాతథంగా 21.5%గా ఉండనుంది.
 
 కారణం ఇదీ..
 రేట్లు ఎక్కడివక్కడే ఉంచడానికి కారణాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించింది. ప్రత్యేకించి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలి అకాల వర్షాలను ప్రస్తావించింది. దీనివల్ల ఆహార ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే ఎప్పటికప్పుడు లభ్యమయ్యే స్థూల ఆర్థిక గణాంకాల ఆధారంగా తగిన ద్రవ్య పరపతి విధానాన్ని అనుసరించడం జరుగుతుందని గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 
  ద్రవ్యోల్బణం ఆయా అంశాలను తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, తగిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఇక ఇప్పటికే రెండు దఫాలుగా అరశాతం పాలసీ రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించే అంశం సైతం పెండింగులో ఉండగా... ఇప్పటికిప్పుడు మరో దఫా కీలక రేటు తగ్గింపు సరికాదని ఆర్‌బీఐ భావించినట్లు కనబడుతోందని విశ్లేషకులు పేర్కొం టున్నారు. తదుపరి ‘కోత’ నిర్ణయం సైతం దీనిపైనే ఆధారపడి ఉంటుందని పాలసీ పేర్కొనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ఊహించిన విధంగానే..: కేంద్రం పాలసీ నిర్ణయం ఊహించిన విధంగానే ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు.
 
 బ్యాంకింగ్ కోర్టులో బంతి: పరిశ్రమలు
 పాలసీ రేటును ఆర్‌బీఐ తాజాగా తగ్గించకపోవడం పట్ల పరిశ్రమలు కొంత నిరుత్సాహాన్ని వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు పునరుత్తేజం, డిమాండ్ పునరుద్ధరణ వంటి అంశాలు రుణ రేటు కోతమీదే ఆధారపడి ఉన్నాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. అయితే రెండు దఫాలు పాలసీ రేటు కోతను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం ఇక బ్యాంకింగ్ నిర్ణయంమీదే ఆధారపడి ఉందన్నారు. గత 2 దఫాల రుణ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం వినియోగదారులకు బదలాయించాలని రియల్టర్ల ప్రధాన సంఘం క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ పేర్కొన్నారు. పలు ప్రాజెక్టులు ఇప్పటికే పెండింగులో ఉన్నాయని, రుణ రేటు తగ్గింపు ప్రయోజనం ఇన్వెస్టర్లకు అందితేనే ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశముందని సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ అన్నారు.
 
 బ్యాంకింగ్ ‘దిగిరాక’ తప్పదు: రాజన్
 ఈ ఏడాది ఇప్పటికే రెండు దఫాలు పాలసీ రేటు రెపోను అరశాతం తగ్గించినప్పటికీ ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించకపోవడంపై రాజన్ మాట్లాడుతూ, వడ్డీరేట్లు తగ్గించక తప్పని పరిస్థితిని మార్కెట్ పరిస్థితులే సృష్టిస్తాయని అన్నారు.  నిధుల సమీకరణ వ్యయమే అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో రుణ రేటు తగ్గింపు కష్టమని బ్యాంకింగ్ వర్గాలు కొన్ని పేర్కొనడం ‘నాన్సెన్స్’గా రాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల రెండుసార్లు పావుశాతం చొప్పున పాలసీ రేట్ల కోత అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనివల్ల వ్యవస్థలో తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పరిస్థితి కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు.
 
   పాలసీ రేటు తగ్గింపు ప్రయోజనం కస్టమర్లకు బదలాయించేలా తగిన వెసులుబాటును కల్పించడం లక్ష్యంగా ఆర్‌బీఐ పనిచేస్తుందని అన్నారు. వడ్డీరేట్లు తగ్గితే రుణ వృద్ధి రేటూ పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లిక్విడిటీ, పోటీ పూర్వక వాతారణం వంటి అంశాలు బ్యాంకింగ్ వడ్డీరేట్లు తగ్గించే పరిస్థితిని సృష్టిస్తాయని అన్నారు. ఇలాంటి పరిస్థితి తప్పనిసరిగా ఉత్పన్నమవుతుందని, వెరసి ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని కల్పిస్తుందని విశ్లేషించారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, అక్కడి నిర్ణయాలు తమ పాలసీ విధానంపై పెద్దగా ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనే సత్తా ప్రస్తుతం దేశానికి ఉందని అన్నారు. భారత్ వద్ద 343 బిలియన్ డాలర్ల విదేశీ మారకపు ద్రవ్య నిధులు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిం చారు. సీఆర్‌ఆర్‌కూ- తక్కువ రుణ రేటుకు సంబంధం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, సీఆర్‌ఆర్ తగ్గింపునకు ఎస్‌బీఐ డిమాండ్‌ను తోసిపుచ్చారు.
 
 2015-16లో వృద్ధి 7.8 శాతం
 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం అంచనా. ఇది 2015-16లో 7.8 శాతానికి పెరిగే అవకాశం.
 2016 మార్చి నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 5.8 శాతం. ఈ ఏడాది ఆగస్టు నాటికి 4 శాతం.
 జూన్ 2న రెండవ ద్వైమాసిక విధాన ప్రకటన.
 ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే (బ్యాంకుల) ఆవరణకు వెలుపల, అలాగే మొబైల్ ఏటీఎంల ఏర్పాటునకు స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు అనుమతి.
 
 0.15-0.25 శాతం తగ్గించిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ
 వడ్డీ రేట్ల తగ్గింపు షురూ

 
 ముంబై: రిజర్వ్ బ్యాంక్ అక్షింతల నేపథ్యంలో బ్యాంకులు ఒక్కొక్కటిగా రుణాలపై కనీస వడ్డీ రేట్లను (బేస్ రేటు) తగ్గించడం మొదలుపెట్టాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.15-0.25 శాతం మేర తగ్గించాయి. దీంతో ఇకపై ఎస్‌బీఐ బేస్ రేటు 10 శాతం స్థాయి నుంచి 9.85 శాతానికి తగ్గుతుంది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 14.75 శాతం నుంచి 14.60 శాతానికి తగ్గుతుంది. కొత్త రేట్లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి.  అటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం బేస్ రేటును 0.15% తగ్గించడంతో ఇది 9.85 శాతానికి దిగివస్తుంది. కొత్త రేటు ఏప్రిల్ 13 నుంచి అమల్లోకి వస్తుంది.  ఐసీఐసీఐ బ్యాంకు అత్యధికంగా 0.25 శాతం మేర తగ్గించడంతో ఇకపై బేస్ రేటు 9.75 శాతంగా ఉండనుంది. 10 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇక లక్ష్మీవిలాస్ బ్యాంక్ రేట్ 0.15% తగ్గి 11.10 శాతానికి చేరింది.
 

మరిన్ని వార్తలు