రేపు ఆర్బీఐ పగ్గాలు చేపట్టనున్న రాజన్

3 Sep, 2013 16:00 IST|Sakshi

ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ముంబై నగరంలోని మింట్ రోడ్డులోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు నుంచి రాజన్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే రూపాయి పతనం, అధిక ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు పాతాళానికి పడిపోవడం, ప్రస్తుత ఖాతా లోటు తదితర పరిస్థితలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదెలు అయింది.

 

ఈ నేపథ్యంలో ఆయన ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థను రాత్రికి రాత్రే కొత్త పుంతలు తొక్కించేందుకు తన వద్ద మంత్రదండం ఏమి లేదని ఆర్బీఐ గవర్నర్ పదవికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన సమయంలో రాజన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ముఖ్య ఆర్థికవేత్తగా పని చేసిన అపార అనుభవం రాజన్ సొంతం. అలాగే భారత ఆర్థిక మంత్రికి ముఖ్య సలహాదారునిగా రాజన్ గత ఆగస్టులో నియమితులయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు తన పదవి కాలం రేపటితో ముగియనుంది.
 

మరిన్ని వార్తలు