‘లోక్‌సభ’కు వ్యూహమెలా?

22 Feb, 2014 02:27 IST|Sakshi
‘లోక్‌సభ’కు వ్యూహమెలా?

* రాహుల్ గాంధీ సారథ్యంలో సీడబ్ల్యూసీ అనధికార భేటీ
* ఎన్నికల ప్రచారంలో ఏయే అంశాలు ప్రస్తావిద్దాం
* సూచనలు కోరిన    కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
* హాజరుకాని ప్రధాని, సోనియా
 
 న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రస్తావించాల్సిన అంశాల గురించి చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పనలో ఏఐసీసీ నేతలు తలమునకలైన నేపథ్యంలో రాహుల్ సారథ్యంలో సీడబ్ల్యూసీ అనధికారికంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీలో ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొనలేదు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీ అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ విలేకరులతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలతోపాటు ఇతర రాజకీయ అంశాలపై సభ్యుల సలహాలను రాహుల్ కోరినట్లు చెప్పారు.
 
  పార్టీ మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహిస్తున్న రక్షణశాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీ ఈ సూచనలను పరిశీలిస్తారని చెప్పారు. పార్టీ ఎటువంటి ఆలోచనలు, వ్యూహంతో ముందుకెళ్లాలని నేతలు కోరుకుంటున్నారో రాహుల్ తమ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారని వివరించారు. కాగా, ఆదివారం హర్యానాలోని సోనిపట్‌లో రైతులతో రాహుల్ భేటీకానున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై నేరుగా వివిధ వర్గాల ప్రజల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నంలో భాగంగానే రాహుల్ రైతులతో భేటీ కానున్నట్లు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడంలో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నారనేందుకు ఈ భేటీ సంకేతమని వివరించాయి.

మరిన్ని వార్తలు