బ్రేకింగ్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మీరే ఉండాలి!

7 Nov, 2016 16:08 IST|Sakshi
బ్రేకింగ్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మీరే ఉండాలి!
  • రాహుల్‌ను ఏకగ్రీవంగా కోరిన సీడబ్ల్యూసీ

  • న్యూఢిల్లీ: సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలను వెనువెంటనే చేపట్టాల్సిందిగా గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా కోరింది. ప్రస్తుతం తన తల్లి సోనియాగాంధీ చేతుల్లో ఉన్న అధ్యక్ష పదవిని అధిష్టించాల్సిందిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) తాజాగా ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే, ఎప్పటిలాగే రాహుల్‌గాంధీ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరో ఏడాదిపాటు పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని కొనసాగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.

    అనారోగ్యం కారణంగా కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియాగాంధీ హాజరుకాలేకపోయారు. అయితే, ఆమెనే పార్టీ చీఫ్‌గా కొనసాగించాలని సీడబ్ల్యూసీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని త్వరలోనే ఎన్నికల సంఘానికి తెలియజేయనున్నారు. అయితే, ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ పగ్గాలు రాహుల్‌కు అప్పగించాలన్న విజ్ఞప్తి తెరపైకి వచ్చిందని, కానీ, కీలక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ పగ్గాల మార్పు జరగలేదని తెలుస్తోంది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా కోలుకోలేదు. కేరళ, అసోంలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో కీలకమైన యూపీలో చావో-రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కొంటున్నది.

మరిన్ని వార్తలు