రాహుల్ చెప్పిన 'సూట్ వాలా' పిట్టకథ..

19 Sep, 2015 17:07 IST|Sakshi
రాహుల్ చెప్పిన 'సూట్ వాలా' పిట్టకథ..

'టిప్ టాప్గా సూటు, బూటు వేసుకున్న పెద్ద మనిషి ఏదో పని నిమిత్తం ఓ ఊరికి బయలుదేరాడు. దారిలో ఆయనకొక వాగు అడ్డొచ్చింది.  దీంతో ఆ పెద్దమనిషి వాగుదాటేందుకు పడవ ఎక్కుతాడు. ప్రయాణం సాగుతుండగా పడవ నడిపే వ్యక్తితో మాట కలుపుతాడు..
సూట్ వ్యక్తి: ఏమయ్యా ఇదొక్కటే పనా ఇంకేదైనా చేస్తావా?
పడవ వ్యక్తి: నాదేముంది బాబయ్యా.. వాగులోకి నీళ్లొచ్చినప్పుడు పడవేస్తాను. మిగతా రోజుల్లో కూలి పనులు చేసుకుంటా
సూటు వ్యక్తి: అయితే నీకు సైన్స్ తెలియదన్నమాట!
పడవ వ్యక్తి: ఏమో సారూ.. పడవ నడపటం వచ్చు.
సూటు వ్యక్తి: లాభం లేదయ్యా.. సైన్స్ తెలియలేదంటే నీ జీవితం పాతిక శాతం వ్యర్థమయినట్లే. సరే, గణిత శాస్త్రమైనా తెలుసా?
పడవ వ్యక్తి: ఆ పదం వినడం ఇదే మొదటిసారయ్యా..
సూటు వ్యక్తి: అదేంటయ్యా.. మ్యాథ్స్ కూడా తెలిలేదంటే సగం జీవితం ఓటిదన్నట్లే.  పోనీ,  జీవశాస్త్రం, వృక్ష శాస్త్రాలైనా తెలుసా లేదా.. తెలియదంటే నీ జీవితం వ్యర్థమనే అర్థం!
పడవ వ్యక్తి: ఎందుకు సార్ నన్ను చంపుకు తింటారు.. అవేవీ నాకు తెలియదని చెప్పాగా..
ఇంతలో వాగులో నీటి వరద పెరిగింది. పడవ ఊగటం మొదలైంది. సూటు వ్యక్తి ముఖంలో మారుతున్న రంగులను గమనిస్తూ చిన్నగా అడిగాడు..
పడవ వ్యక్తి: సారూ.. మీరు ఈత శాస్త్రం నేర్చుకున్నారా?
సూట్ వ్యక్తి: ఇన్ని శాస్త్రాలు తెలిసిన వాణ్ని నాకు దాంతో పనేంటయ్యా.. అయినా ఎందుకడుగుతున్నావిప్పుడు?
పడవ వ్యక్తి: అరే బాబూ.. నేను చెప్పిన శాస్త్రం తప్ప మిగతావేవీ ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడలేవు..


అంటూ కథను ముగించారు రాహుల్ గాంధీ. స్వచ్ఛభారత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఏం చేయాలో పారిశుధ్య కార్మికులను అడిగి తెలుసుకోవాల్సిందిపోయి.. తనలాగే సూట్లు ధరించిన వ్యక్తుల సలహాలు తీసుకుంటున్న మోదీ.. కథలోని సూట్ వ్యక్తిలా అవసరమైనవి నేర్చుకోలేకపోతున్నారని రాహుల్ విమర్శించారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మధ్యాహ్నం చంపారన్ జిల్లా రామ్నగర్ పట్టణంలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు.  ఎప్పటిలాగే ప్రసంగం ఆద్యంతం విమర్శనాస్త్రాలతోనే సాగింది. ఈ సందర్భంగా అందరికీ తెలిసినదే అయినప్పటికీ రాహుల్ గాంధీ చెప్పిన పిట్టకథకు జనం హర్షధ్వానాలు చేశారు.

మరిన్ని వార్తలు