రాహుల్ గాంధీకి హిందీ రాదా?

14 Aug, 2015 08:13 IST|Sakshi
రాహుల్ గాంధీకి హిందీ రాదా?

న్యూఢిల్లీ: త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మారనున్న ప్రస్తుత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇప్పుడా విషయం ఆయా సామాజిక అనుసంధాన వేదికల్లో, ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. 'రాహుల్ గాంధీకి హిందీ రాదా' ఈ విషయమే ఇప్పుడు అంతా ఇంటర్నెట్లో ప్రశ్నించుకుంటున్నారు. బుధవారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో లోక్సభలో లలిత్ గేట్ వ్యవహారంపై సుష్మా స్వరాజ్ ప్రసంగం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ ప్రసంగంలో సుష్మాకు, ప్రధాని నరేంద్ర మోదీకి పలు సవాల్లు విసిరారు. ఓ రకంగా ఎన్నడూ లేనంతగా తన వాగ్దాటితో ఊగిపోయారు.

అయితే, ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన ముందే ఒక పేపర్ పై రాసుకుని ఉండటం విశేషం. మరో ముఖ్యవిషయమేమిటంటే ఆయన పార్లమెంటులో హిందీలో ప్రసంగించగా ఆ మాటలన్నింటిని కూడా పేపర్పై ఇంగ్లిష్లో పెద్ద పెద్ద అక్షరాల్లో రాసుకుని ఉండటం. సమావేశం అనంతరం తాను రాసుకున్న పేపర్తో రాహుల్ బయటకు వస్తుండగా ఓ మీడియా కెమెరా ఆ పేపర్ పడింది. దాంతో క్లిక్ మనిపించగా ఈ విషయం వెలుగుచూసింది.

రాహుల్ చేతిలోని పేపర్లో 'మోదీ ఏం చెప్తారో చూడాలని దేశం ఎదురుచూస్తుంది, వినాలనుకుంటుంది. లలిత్ గేట్, వ్యాపం, గాంధీ మూడు కోతులు' అనే వాక్యాలతోపాటు మరిన్ని ఉన్నాయి. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శులు గుప్పించగా మరికొందరు సమర్థించారు. రాహుల్కు హిందీ రాదా, దేవనాగరి లిపిని ఆంగ్లంలో రాయడమేమిటీ అని కొందరు ప్రశ్నించగా, ప్రజాస్వామ్య దేశంలో రాహుల్కు రాసుకునే స్వేచ్ఛ కూడా ఉండకూడదు, ఇందులో చర్చాంశమేముంది అని సమర్థించారు.

మరిన్ని వార్తలు