బ్రేకింగ్‌: ఏంటి పరిస్థితి: సీఎంకు రాహుల్‌ ఫోన్‌

2 Aug, 2017 11:36 IST|Sakshi
ఏంటి పరిస్థితి: సీఎంకు రాహుల్‌ ఫోన్‌

న్యూఢిల్లీ: గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో బస చేస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా బుధవారం ఉదయం ఆదాయపన్నుశాఖ (ఐటీ) రంగంలోకి దిగింది. కర్ణాటక మంత్రి శివకుమార్‌, ఎంపీ డీకే సురేశ్‌  సహా గుజరాత్‌ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్‌పైనా ఊహించనిరీతిలో దాడులు చేసింది. మొత్తం 38 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంలో కర్ణాటకలో సంచలనం రేపింది.

ఈ అనూహ్య పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇది బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్న హస్తం నేతలు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. తాజా  రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఐటీ దాడుల నేపథ్యంలో అధైర్యపడొద్దని ఆయన పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చింది. బెంగళూరులో ఐటీ దాడుల అంశం రాజ్యసభను కుదిపేసింది. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ఐటీ దాడులను తప్పుబడుతూ.. సభలో ఆందోళనకు దిగారు.

గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 44మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఈగల్‌ టన్‌ గోల్ఫ్‌ రిసార్ట్‌లో బస చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికల జరగనున్నాయి. అప్పటివరకు ఎమ్మెల్యేలు జారిపోకుండా.. బీజేపీ వల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందు జాగ్రత్తగా కర్ణాటకకు తరలించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ తమ ఎమ్మెల్యేలపై బీజేపీ ప్రలోభాలకు గురిచేయలేదని భావించింది. ఈ నేపథ్యంలో రిసార్ట్‌లో గుజరాత్‌ ఎమ్మెల్యేల బాగోగులు చూసుకుంటున్న కర్ణాటక మంత్రి శివకుమార్‌పై ఐటీ దాడులు జరగడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణించింది.
 

మరిన్ని వార్తలు