రాజీనామా చేస్తా..

24 Aug, 2017 01:25 IST|Sakshi
రాజీనామా చేస్తా..

వరుస రైలు ప్రమాదాలతో సురేశ్‌ప్రభు కలత
రాజీనామాపై తొందరపడవద్దని వారించిన ప్రధాని


న్యూఢిల్లీ: ఐదు రోజుల వ్యవధిలో రెండు భారీ రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దీనికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో రైలు ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే రాజీనామాపై తొందరపడవద్దని ప్రధాని సురేశ్‌ప్రభును వారించారు. బుధవారం కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం సురేశ్‌ప్రభు ప్రధానితో సమావేశమయ్యారు. ‘‘నేను ప్రధాని మోదీతో సమావేశమయ్యాను.

 ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తానని చెప్పాను. అయితే ఆయన నన్ను వేచి ఉండాలని చెప్పారు’’ అని ప్రభు ట్వీటర్‌లో వెల్లడించారు. ఈనెల 19న ఉత్తరప్రదేశ్‌లో కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 23 మంది ప్రయాణికులు మరణించగా.. మరో 150 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. బుధవారం అదే రాష్ట్రంలో కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు.

 వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో సురేశ్‌ప్రభు తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ట్వీటర్‌లో ఆయన ఉద్వేగంగా స్పందించారు. యూపీలో జరిగిన రెండు ప్రమాదాలు తనను తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. జవాబుదారీతనం అనేది ప్రభుత్వంలో మంచి విధానమని, రైల్వే మంత్రి ప్రతిపాదనపై తుది నిర్ణయం ప్రధాని మోదీదే అని కేబినెట్‌ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

సురేశ్‌ప్రభుని తొలగించాలి: కాంగ్రెస్‌
రైల్వే మంత్రిగా సురేశ్‌ప్రభు విఫలమయ్యారని, ఆయనను పదవి నుంచి తొలగించాలని, బాధ్య తాయుతమైన వ్యక్తికి ఆ బాధ్యతలను అప్పగిం చాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మోదీ ప్రభుత్వం వచ్చాక 28 భారీ రైలు ప్రమాదాలు జరిగాయని, 259 మంది ప్రాణాలు కోల్పోగా.. 973 మంది గాయపడ్డారని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా చెప్పారు.

మరిన్ని వార్తలు