గంటకు 500 కిలో మీటర్ల వేగం..!

1 Sep, 2016 13:19 IST|Sakshi
గంటకు 500 కిలో మీటర్ల వేగం..!

న్యూఢిల్లీ: భారతీయ రైళ్ల వేగంలో కొత్త అధ్యాయనానికి అడుగులుపడుతున్నాయి.. గంటకు 500 కిలోమీటర్ల వేగంతో రైళ్లను పరుగులు పెట్టించేందుకు రైల్వే శాఖ వ్యూహాలు రచిస్తోంది. మిషన్ 350 ప్లస్ లో భాగంగా త్వరలోనే ఓ మీటింగ్ ను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో అల్ట్రా హై స్పీడ్ టెక్నాలజీ ద్వారా గంటకు 500 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంపై చర్చించనున్నారు.

ఈ మేరకు ఇప్పటికే పీపీపీ పద్దతిలో టెండర్లను కూడా రైల్వే శాఖ పిలిచింది. ఇందుకు ఈ నెల 6 చివరి తేదీ కాగా ఇప్పటికే నాలుగు అంతర్జాతీయ కంపెనీలు ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకువచ్చాయి. ప్రపంచంలో అందుబాటులో ఉన్న అన్ని టెక్నాలజీలను పరిశీలించిన మీదట ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని రైల్వే శాఖ వర్గాలు చెప్పాయి.

ప్రస్తుతం జర్మనీ, చైనా, జపాన్ దేశాల్లో లెవియేషన్ టెక్నాలజీని ఉపయోగించి గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడుపుతున్నారు. ఈ టెక్నాలజీని మెరుగుపర్చుతూ గంటకు 500 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకునే డిజైన్లను తయారుచేసేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దీనిపై ఈ నెల 2న అంతర్జాతీయ సెమినార్ జరగనుంది.

ఈ సెమినార్ పై జర్మనీ, అమెరికా, జపాన్, స్విట్జర్లాండ్, స్పెయిన్ లు ఆసక్తి కనబరుస్తున్నాయి.. కొత్త టెక్నాలజీల కోసం విదేశాల మీద ఆధారపడకుండా సొంత టెక్నాలజీని డెవలప్ చేసేందుకు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు యోచిస్తున్నట్లు సమాచారం. వివిధ దేశాలకు చెందిన 500 మందికి పైగా ప్రతినిధులు సెమినార్ కు హాజరవ్వనున్నారు.

మరిన్ని వార్తలు