వానబీభత్సం.. వరిపంటలకు తీవ్రనష్టం

23 Oct, 2013 08:18 IST|Sakshi
వానబీభత్సం.. వరిపంటలకు తీవ్రనష్టం

సాక్షి నెట్‌వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సీమాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుం డా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ, టమాటా తదితర పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. చేలల్లోకి నీరు చేరడంతో చెరువుల్లా మారాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో తూర్పు గోదావరి జిల్లా తడిసిముద్దవుతోంది. కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాలకు కోనసీమ ముంపుబారిన చిక్కుకుంది. డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. తుని, పెద్దాపురం, పిఠాపురం సబ్ డివిజన్ల పరిధిలో సుమారు 5 వేల ఎకరాల్లో పూత దశలో ఉన్న పత్తి చేలల్లో నీరు నిలిచిపోయింది. డెల్టా పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి.
 
 మరోరోజు వర్షం కురిస్తే రెండు డెల్టాల్లోని డ్రెయిన్లు పోటెత్తి వరి చేలు ముంపు బారినపడే ప్రమాదం ఉందని రైతులు కలవరపడుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో వర్షంతో 10 వేల ఎకరాల్లో వేరుశనగ, ఉల్లి 100, సజ్జ 120, 400 ఎకరాల్లో టమాటా పంటలకు నష్టం వాటిల్లింది. చామంతి తోటలు నీటమునిగాయి. నూర్పిడి దశలో ఉన్న వేరుశనగ పంటను రైతులు పీకేశారు. కడప-పులివెందుల ప్రధాన రహదారిలోని రామరాజుపల్లె వద్ద ఉన్న వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది.
 
     కృషా ్ణజిల్లాలో మున్నేరు, నల్లవాగు, గుర్రాలవాగు, బుడమేరు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో పత్తి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా పైరు ఈత దశలోనూ, సుంకు పోసుకునే దశలోనూ ఉంది.
     పశ్చిమ గోదావరి జిల్లాలో పై-లీన్ తుపాను వల్ల వరి కోతలు వారుుదా పడగా, తాజా వర్షాలు మాసూళ్లకు ఆటంకంగా మారారుు. పొగాకు నాట్లకు బ్రేక్ పడింది. డెల్టాలో ఈనిక, గింజ గట్టిపడే దశలో ఉన్న వరిచేలు వర్షాలకు నేలనంటుతున్నారుు. 20 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. కోత కోసి కళ్లాల్లో ఉన్న వరి పనలు తడిసి ముద్దయ్యూరుు.
     అనంతపురం జిల్లాలో పలుచోట్ల తొలగించిన వేరుశనగ కట్టె పొలాల్లోనే ఉండటంతో వానకు తడిసిపోయింది. మరో రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉంటే వేరుశనగ కాయలు నల్లబడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
     {పకాశం జిల్లాలో ఇప్పటికే సాగులో ఉన్న పంటలు ప్రస్తుత వర్షాలతో జీవం పోసుకోగా, కొత్త పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. పలు వాగులు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి.
     విజయనగరం జిల్లా మక్కువ మండలంలో సుమారు 100 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లగా, దత్తిరాజేరులో రెండు ఇళ్లు వర్షానికి నాని కూలిపోయాయి.
     కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ, సంజామల, ఆళ్లగడ్డ మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి, తదితర పంటలు నీట మునిగాయి. పొలాల్లోనే కుప్పలుగా వేసిన వేరుశనగ తడిసిపోవడంతో కాయలు దెబ్బతినే ప్రమాదం
 ఏర్పడింది.
     శ్రీకాకుళం జిల్లాలో వర్షాలకు ఈదురు గాలులు కూడా తోడవడంతో కొన్ని ప్రాంతాల్లో వరిచేలు నేలకొరిగాయి. పై-లీన్ తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ఉద్దానం ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో కొబ్బరి, జీడి పంటలకు మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
     కుండపోతగా కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లాలో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
     వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్‌లో టమాటా పంటకు తెగుళ్లు సోకి కాయలు కుళ్లడంతో తోటల్లోనే పంట నాశనమవుతోంది. డివిజన్‌లో 30 వేల హెక్టార్లలో పంటదెబ్బ తిని రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని  ఉద్యానవనశాఖ అధికారుల అంచనా. వేరుశనగ రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఘాట్ రోడ్లలో చెట్లకొమ్మలు, చిన్నపాటి బండరాళ్లు పడ్డాయి.  


     శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షంతో నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
 ఏర్పడింది.
     గుంటూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కంట్రోల్ రూంలను ఏర్పాటుచేశారు. తీరప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తంచేశారు. అనేకచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
     ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాలవల్ల పత్తి తడిసిపోయి నల్లబారి పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ముగ్గురు గల్లంతు
 శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గొలుగువానిపేట గ్రామానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా తెప్ప బోల్తాపడింది. ఈ ఘటనలో మత్స్యకారుడు గొల్ల కృష్ణమ్మ గల్లంతయ్యాడు. విశాఖ నగరంలో గెడ్డలో వర్షపు నీటికి ఓ వృద్ధురాలు గల్లంతయింది. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని కుప్పగంజివాగు పక్కనే ఆడుకుంటున్న బాలుడు జుజ్జూరి రమేష్(7) ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు.
 
 పత్తి రైతుకు కన్నీళ్లు
 కర్నూలు జిల్లా ఆదోనిలోని పత్తి మార్కెట్ యార్డులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దిగుబడులు తడుస్తుండటం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. సోమవారం వర్షం కారణంగా పత్తి దిగుబడులు తడిసిపోగా టెండర్లు మంగళవారానికి వాయిదా పడ్డాయి. అయితే మంగళవారం కూడా టెండర్లకు వర్షం అడ్డంకిగా మారింది. యార్డుకు ఈ రెండు రోజుల్లో 60 వేల క్వింటాళ్ల దిగుబడులు రాగా.. ఇప్పటివరకు 15 వేల క్వింటాళ్లను మాత్రమే రైతులు అమ్ముకోగలిగారు. వారం క్రితం టెండర్లలో గరిష్టంగా క్వింటాలు రూ. 5,600కు పోగా దిగుబడులు తడిసిన కారణంగా మంగళవారం టెండరు లేకుండా క్వింటాలు రూ. 4,300లోపే కొనుగోలు చేశారు.
 
 కొనసాగుతున్న అల్పపీడనం
 ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన
 సాక్షి, విశాఖపట్నం : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బలపడే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాలను ఆనుకొని పశ్చిమ బంగాళాఖాతంలో ప్రస్తుతం తీరంవైపు అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది వాయుగుండంగా మారే వాతావరణ పరిస్థితులపై బుధవారంనాటికి ఒక అంచనాకు వస్తామని  తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో మరో అల్పపీడన ద్రోణి  కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తామన్నారు.   
 
 వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
 సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం ఆదేశం
 సాక్షి, హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంవల్ల రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. వర్షాల బాధితులకు అన్ని రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని మంగళవారం ఈ అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతికి సూచించారు. వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.

మరిన్ని వార్తలు