హత్య కేసులో మంత్రి కొడుకు పేరు

2 Aug, 2016 19:52 IST|Sakshi

జైపూర్: ఓ హత్య కేసులో రాజస్థాన్ మంత్రి రామ్ ప్రతాప్ కుమారుడు అమిత్ సాహుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో హత్య కేసులో సాక్షిగా ఉన్న హరీష్ సింధి అనే వ్యక్తి సోమవారం హనుమాన్ నగర్ కోర్టుకు రాగా, కోర్టు ఆవరణంలో ఇద్దరు దుండగులు ఆయన్ను కాల్చిచంపారు. నిందితులు సుఖ్బీర్, ధర్మేంద్రలను పోలీసులు నిన్ననే అరెస్ట్ చేశారు.

పోలీసులు నిందితులను విచారించిన మీదట ఈ కేసులో మంత్రి కొడుకు అమిత్ సాహూతో పాటు మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని సాహు చెప్పాడు. రాజకీయ కారణాలతో తన పేరును ఈ కేసులోకి లాగారని ఆరోపించాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తనను సంప్రదించలేదని తెలిపాడు. కోర్టుకు దగ్గరలోనే ఉన్న కలెక్టర్ కార్యాలయానికి పనిమీద వెళ్లానని, అంతేకాని తనకు ఈ కేసుకు సంబంధంలేదని చెప్పాడు. కాగా ఈ మంత్రి రామ్ప్రతాప్ ఈ కేసు విషయంపై స్పందించలేదు.
 

మరిన్ని వార్తలు