రాజమండ్రి జైలులో భూగర్భ ఉరికంబం

17 Aug, 2015 02:00 IST|Sakshi
రాజమండ్రి జైలులో భూగర్భ ఉరికంబం

పరిపాలనా భవనం కింద ఏర్పాటు.. దేశంలోనే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: రాజమండ్రి కేంద్ర కారాగారంలో దేశంలోనే తొలి అండర్‌గ్రౌండ్ గ్యాలోస్ నిర్మించారు. మరణ శిక్ష పడిన ఖైదీలను ఉరితీసే ఉరికంబం ఉండే ప్రాంతాన్ని సాంకేతికంగా గ్యాలోస్ అని పిలుస్తారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద ఈ గ్యాలోస్ ఏర్పాటైంది. ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించడానికి జైళ్ల శాఖ సన్నాహాలు చేస్తోంది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో 1875 నుంచి గ్యాలోస్ కొనసాగుతోంది.

ఇది 1980 వరకు జైలు ప్రధాన ద్వారం పక్కన ఉండేది. ఖైదీని జైలు గది నుంచి బయటకు తీసుకువచ్చి, ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేకమైన చాంబర్‌లోకి దించుతారు. ఇక్కడి నుంచి నేరుగా సంబంధీకులకు అప్పగించెయ్యాలని, మృతదేహాన్ని జైలు మీదుగా బయటకు తీసుకురాకూడదనే ఉద్దేశంతో బ్రిటిష్ పాలకుల హయాంలో ఈ ఏర్పాటు చేశారు.

అనంతరం 1980 దశకంలో అనివార్య కారణాల వల్ల ఈ గ్యాలోస్‌ను పరిపాలన భవనం పరిసరాల్లో ఉన్న ఖాళీ ప్రాంతానికి మార్చారు. ఇటీవల ఈ ప్రాంతంలో రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనం నిర్మించారు. దీంతో గ్యాలోస్‌ను కూడా మార్చాల్సి వచ్చింది. జైలులో మరో అనువైన ప్రాంతం లేకపోవడంతో నూతన పరిపాలనా భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరొకటి లేదని అధికారులు చెబుతున్నారు.

గ్యాలోస్‌ను ఒకచోటు నుంచి మరో చోటుకి మార్చినా ఇప్పటికీ బ్రిటిష్ కాలంనాటి ఇనుప ఉరికంబాన్నే కొనసాగిస్తున్నారు. తరచుగా దీనికి ఆయిలింగ్ చేస్తూ పనితీరు దెబ్బతినకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జైలులో తలారీ ఎవరూ లేరు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఉరి శిక్షను అమలు చేయాల్సి వస్తే పదవీ విరమణ పొందిన తలారీల సేవలు తీసుకోవడమో లేదంటే ఔట్‌సోర్సింగ్‌ను వినియోగించుకోవడమో చేస్తామని జైలు అధికారులు పేర్కొంటున్నారు.ఇక్కడ చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు.

మరిన్ని వార్తలు