బిన్‌ లాడెన్‌ కోసం సద్దాం హుస్సేన్‌ దుస్సాహసం

15 May, 2017 19:56 IST|Sakshi
బిన్‌ లాడెన్‌ కోసం సద్దాం హుస్సేన్‌ దుస్సాహసం

మండల్‌: ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇస్లామిక్‌ ప్రపంచంలో విపరీత మార్పులకు కారకులు ఒసామా బిన్‌ లాడెన్‌, సద్దాం హుస్సేన్‌లు. ఒకే తరానికి చెందిన ఈ నాయకులవి పక్కపక్క దేశాలే అయినా.. ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు.(అమెరికా నిఘా సంస్థలు మాత్రం సద్దాం-లాడెన్‌లు రహస్యంగా కలుసుకునేవారని ఆరోపిస్తాయి) ఇప్పటి విషయానికి వస్తే.. మన దేశంలో చోటుచేసుకున్న ఓ ఘటన..‘లాడెన్‌ కోసం సద్దాం సాహసం’ అనే శీర్షికను బలపరుస్తుంది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని మండల్‌ పట్టణానికి చెందిన సద్దాం హుస్సేన్‌ మన్సూరీ(25) అనే యువకుడిని శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానికంగా ఉంటూ, కొన్నేళ్లుగా ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్‌ను నడుపుకొంటున్న సద్దాం.. ఇటీవలే ఓ పనికిమాలిన పనికి పూనుకున్నాడు. ఒసామా బిన్‌ లాడెన్‌ ఫొటోతో, అదే పేరు మీద ఆధార్‌ కార్డు సృష్టించాడు. అఫ్ఘాన్‌ తపాగా, గుబురుగడ్డంతో ఉన్న లాడెన్‌ ఫొటోను యూఐడీఏఐ ఉన్నతాధికులు గుర్తించడంతో సద్దాం నేరం బయటపడింది.

ఐటీ చట్టాన్ని అనుసరించి సద్దాం హుస్సేన్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు.. అసలు ఎందుకీ పని చేశాడు? అనే విషయాన్ని శోధిస్తున్నారు. ఐటీ శాఖ ఫిర్యాదు మేరకు సద్దాంను అరెస్ట్‌ చేసి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడతాయని మండల్‌ సీఐ చంచల్‌ మిశ్రా మీడియాతో అన్నారు.
(పోలీసుల అదుపులో సద్దాం హుస్సేన్‌ మన్సూరీ)

మరిన్ని వార్తలు