రేపట్నుంచి రాజధాని, శతాబ్ది, దురంతో రైలు ఛార్జీల పెంపు

16 Oct, 2013 15:30 IST|Sakshi

రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి రైళ్లలో అయితే త్వరగా, సౌఖ్యంగా వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీ జేబుకు మాత్రం కాస్తంత భారం తప్పదు. ఎందుకంటే, ఆయా రైళ్లలోని కేటరింగ్ ఛార్జీలను రైల్వే శాఖ 2 నుంచి 4 శాతం వరకు పెంచుతోంది. ఈ పెంపు గురువారం నుంచి అమలులోకి రానుంది. ఈ రైళ్ల ఛార్జీలలోనే అందులో ఇచ్చే ఆహార పదార్థాల ఖర్చుకూడా కలిసుంటుందన్న విషయం తెలిసిందే. వాటి ఖరీదునే ఇప్పుడు పెంచారు. గడిచిన పది రోజుల్లో ప్రయాణికులపై భారం పెరగడం ఇది రెండోసారి. ఈనెల ఏడో తేదీనే రైల్వేశాఖ ఇంధన సర్దుబాటు పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందే ఈ రైళ్లకు టికెట్లు కొనుక్కున్నవాళ్లు మాత్రం మిగిలిన ఛార్జీని టీటీఈలకు చెల్లించాల్సి ఉంటుందని రైల్వేశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ తరహా రైళ్లలో కేటరింగ్ ఛార్జీలను 14 సంవత్సరాల తర్వాత పెంచుతున్నారు. చిట్టచివరి సారిగా వీటిని 1999లో పెంచారు. ఛార్జీ పెంచడమే కాదు, మెనూలో కొత్త కొత్త వెరైటీలు కూడా చేరుస్తున్నారు. ఏసీ -1, ఎగ్జిక్యూటివ్ క్లాస్లలో చేపల వేపుడు, స్టఫ్డ్ పరోటా, అన్ని తరగతుల వారికీ ఫ్లేవర్డ్ మిల్క్ కూడా ఇవ్వనున్నారు. అలాగే స్టఫ్ చేసిన రోల్స్ కూడా ఇస్తారు. వీటికి బదులు చాక్లెట్లు, టాఫీలు, పండ్ల రసాలను తొలగించారు. ఉదయం, సాయంత్రం ఇచ్చే టీ ధరను 30-4౦ శాతం వరకు తగ్గించినా, టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనాల ధరను మాత్రం 50-60 శాతం పెంచారు. రాజధాని, దురంతో రైళ్లలో కొత్తగా కాంబో మీల్ను ప్రవేశపెడుతున్నారు. వీటి ధరలు మామూలు భోజనంతో పోలిస్తే సగమే ఉంటాయట!!

మరిన్ని వార్తలు