సీఎంకు షాకిచ్చిన టాప్‌ లాయర్‌!

26 Jul, 2017 15:57 IST|Sakshi
సీఎంకు షాకిచ్చిన టాప్‌ లాయర్‌!

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వేసిన పరువునష్టం దావాలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అబద్ధాలు చెప్తున్నారని సీనియర్‌ లాయర్‌ రాం జెఠ్మలానీ ఆరోపించారు. ఈ పరువునష్టం కేసులో ఇక ఎంతమాత్రం కేజ్రీవాల్‌ తరఫున వాదించబోనంటూ ఆయన తెలిపారు. అంతేకాదు ఇప్పటివరకు ఈ కేసులో వాదించినందుకు ఏకంగా రూ. రెండు కోట్లు లీగల్‌ ఫీజు కింద చెల్లించాలంటూ షాక్‌ ఇచ్చారు. కేసు విచారణ సందర్భంగా జైట్లీని ఉద్దేశించి లాయర్‌ జెఠ్మలానీ నిందాపూర్వక వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. దీనిని తీవ్రంగా తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఈ వ్యాఖ్య మీరే చేశారా? లేదా మీ క్లైంట్‌ సూచిస్తే చేశారా? అని ప్రశ్నించింది.

దీంతో సీఎం కేజ్రీవాల్‌ సూచిస్తేనే తాను ఈ వ్యాఖ్య చేశానని జెఠ్మలానీ చెప్పుకొచ్చారు. దీనిని ఖండిస్తూ లాయర్‌ చెప్పినట్టు తాను ఆ వ్యాఖ్య చేయలేదని కేజ్రీవాల్‌ తాజాగా కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే, అఫిడవిట్‌లో సీఎం కేజ్రీవాల్‌ అబద్ధాలు చెప్తున్నారని, ఆయన ఆ వ్యాఖ్య చేసిన సంగతి వాస్తవమని జెఠ్మలానీ ఆరోపించారు. ఈ కేసులో తాను, కేజ్రీవాల్‌ చర్చించుకున్న విషయాలు ఉన్న లేఖను బయటపెడతానని జెఠ్మలానీ హెచ్చరించారు. ఈ చర్చలలో జైట్లీని ఉద్దేశించి తీవ్రమైన కించపరిచే వ్యాఖ్యలు కేజ్రీవాల్‌ చేసినట్టు ఇప్పటికే కథనాలు వస్తున్నాయి.

ఈ కించపరిచే వ్యాఖ్య నేపథ్యంలో కేజ్రీవాల్‌పై జైట్లీ మరో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తన ప్రతిష్టకు భంగంకలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్‌పై రూ. 10 కోట్ల దావా వేశారు. అంతకుముందు రూ. 10 కోట్ల పరువునష్టం దావాను జైట్లీ కేజ్రీవాల్‌పై వేశారు. తనపై జైట్లీ మరో పరువునష్టం దావా వేయడంతో.. కేజ్రీవాల్‌ తన లాయర్‌గా జెఠ్మలానీని తొలగించారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా