ఎమ్మెల్యే వంశీకి ఫస్ట్..

15 Nov, 2015 09:11 IST|Sakshi
ఎమ్మెల్యే వంశీకి ఫస్ట్..

మంత్రి రవీంద్రకు రెండు, గద్దెకు మూడో ర్యాంకు
ర్యాంకులు బయట పెట్టేందుకు  ఇష్టపడని ఎమ్మెల్యేలు
20 అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ
 
విజయవాడ : రాష్ట్ర ఎమ్మెల్యేల పనితీరుపై తెలుగుదేశం పార్టీ చేయించిన సర్వేలో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఉన్నారు. ఆయన తరువాత రెండో స్థానాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దక్కించుకోగా, మూడో స్థానాన్ని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దక్కించుకున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో కలిపి 16 మందికి 16 ర్యాంకులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
గతంలో విజయవాడలో రాష్ట్ర పార్టీ సమావేశం జరిగినప్పుడు తొలిసారిగా ర్యాంకులు ఇచ్చారు. అప్పట్లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య)కు ఫస్ట్ ర్యాంకు వచ్చిన విషయం విధితమే. అయితే ఈసారి ఆయన ర్యాంకును బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. కాగా నాలుగో ర్యాంకు గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి రావివెంకటేశ్వరరావుకు, ఐదో ర్యాంకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావుకు, ఆరో ర్యాంకు తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్‌కు 12వ ర్యాంకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు దక్కినట్లు తెలిసింది.
 
ర్యాంకులు చెప్పడానికి ఇష్టపడని ఎమ్మెల్యే..
పనితీరుపై నిర్వహించిన సర్వేలో జిల్లాలో తమకు వచ్చిన ర్యాంకును చెప్పడానికి అనేక మంది ఎమ్మెల్యేలు ఇష్టపడలేదు. తిరుపతిలో నిర్వహిస్తున్న సమావేశంలో ఉన్న నాయకులు కనీసం ఫోన్ మాట్లాడటానికి కూడా ఇష్టపడడం లేదు.
 
20 అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ
జన్మభూమి, పేదలకు ఇళ్లు మంజూరు, రుణమాఫి, రేషన్ కార్డులు, ఎమ్మెల్యే పనితీరు  తదితర 20 అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా అంశాలపై ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్‌చార్జి పై చెప్పిన సమాచారంతో పాటు, ఎమ్మెల్యే పనితీరుపైన చెప్పిన అభిప్రాయం ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారని తెలిసింది.

మరిన్ని వార్తలు