అత్యాచార కేసు నిందితుడు రాకేశ్ మేజరే?

6 Mar, 2016 03:52 IST|Sakshi

ఓటు వేసినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు యువతిపై సామూహిక అత్యాచార కేసులో నిందితుడు ముద్దం రాకేశ్ మేజర్ అనే కీలక ఆధారాలు పోలీసులు సేకరించినట్లు సమాచారం. వీణవంక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు శంకరపట్నం మండలం ఆముదాలపల్లెకు చెందిన గొట్టె శ్రీనివాస్, కల్వల గ్రామానికి చెందిన ముద్దం అంజి, ముద్దం రాకేశ్ వెళ్తున్నారు. ఫిబ్రవరి 10న సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్న ఆరోపణతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సంఘటనలో అంజి ఉరఫ్ అంజన్న, రాకేశ్ మైనర్‌లని పోలీసు అధికారులు జువైనల్ హోంకు తరలించారు. బాధిత యువతి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో శని వారం పోలీసులు రాకేశ్ వయసు నిర్ధారణపై ఓటరు జాబితా పరిశీలించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసినట్లు ప్రచారం కావడంతో కేశవపట్నం పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఫోరెన్సిక్  వైద్య పరీక్షల్లో ముద్దం అంజి మేజర్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాకేశ్‌కు 23 ఏళ్లు ఉన్నాయనే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు వివరాలను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు