ఆశగా ఎదురుచూస్తున్న ఆ రంగాలు!

12 Dec, 2016 14:48 IST|Sakshi
ఆశగా ఎదురుచూస్తున్న ఆ రంగాలు!
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పాత నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణాలు ఈ సెక్టార్లను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. రేట్ కోతపై ఆధారపడిన ఈ రంగాల షేర్లు గత మానిటరీ పాలసీ నుంచి 30 శాతం క్రాష్ అయ్యాయి. అమ్మకాల ఒత్తిడి భారీగా కొనసాగుతోంది. దీంతో రేపు విడుదల కానున్న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధాన సమీక్షపై ఈ రంగాలు ఎక్కువగా దృష్టిసారించాయి.
 
ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ద్రవ్యవిధాన కమిటీ విడుదల చేయబోయే రెండో సమీక్షలో కచ్చితంగా రెపో రేటు కోత ఉంటుందని ఓ వైపు విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏర్పడిన నగదు కొరత సమస్యకు ఉపశమనంగా ఉర్జిత్ శుభవార్త చెబుతారా? లేదా? అని ఈ రంగాల మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగ ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పదవిలోకి వచ్చిన తర్వాత తన నేతృత్వంలో విడుదలైన మొదటి పాలసీలో మార్కెట్ వర్గాలకు ఆశ్చర్యకరంగా పాలసీ రేట్లలో కోత విధించి దీపావళి గిప్ట్ను అందించిన సంగతి తెలిసిందే.
 
అనంతరం పాత నోట్ల చలామణి రద్దు అయింది. దీంతో రియల్ ఎస్టేట్, ఆటో మొబైల్ పరిశ్రమ కుప్పకూలింది.  బుధవారం విడుదల చేయనున్న పాలసీలో రేట్ల కోత పెడితే, ఈ రంగాలు కోలుకునే అవకాశముందని, ఈ రంగాల్లో సెంటిమెంట్ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్టోబర్ 4 నుంచి బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 20 శాతం కుప్పకూలింది. గత ఆరు పాలసీ సమీక్ష కాలాల్లో కూడా ఈ రంగం వరస్ట్ ఫర్ఫార్మెన్స్ను నమోదుచేసింది. బ్లాక్మనీ ఎక్కువగా ప్రవహించే సెక్టార్లో ఇదీ ఒకటి కావడం గమనార్హం. అదేవిధంగా ఆటో, కన్సూమర్, బ్యాకింగ్ ఇండెక్స్లు పడిపోయాయి. ఈ ఇండెక్స్లు ఎక్కువగా రేట్ కోతను దృష్టిలో పెట్టుకుని పనితీరును కనబరుస్తుంటాయి. డిమానిటైజేషన్ తర్వాత ద్రవ్యోల్బణానికి, వృద్ధికి పొంచి ఉన్న ముప్పుల నుంచి కాపాడటానికి రేపటి పాలసీలో రేట్లపై కోత విధిస్తుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. 
>
మరిన్ని వార్తలు