హద్దులేని ఆశ: రవిశాస్త్రి మరో డిమాండ్‌!

19 Jul, 2017 12:00 IST|Sakshi
రవిశాస్త్రి మరో డిమాండ్‌!

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అండగా టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. ఇప్పటికే తాను అనుకున్నది సాధించాడు. తనకు నచ్చినవారినే పట్టుబట్టి మరీ తన సహాయక సిబ్బందిగా ఉండేలా పంతం నెగ్గించుకున్నాడు. ఇక్కడితోనే ఆయన కోరికల చిట్టా ఆగిపోలేదు. విదేశీ పర్యటనల్లో టీమ్‌ కన్సల్టెంట్‌గా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కావాలని ఇప్పుడు ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది. కోచ్‌ ఎంపిక కోసం ఏర్పాటైన క్రికెట్‌ సలహాదారుల కమిటీ (సీఏసీ)లో గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌తోపాటు సచిన్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ను, విదేశీ కన్సల్టెంట్‌గా ద్రవిడ్‌ను సీఏసీ ఎంపిక చేసినా.. వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా రవిశాస్త్రి తన అనుయాయిలను సహాయక సిబ్బందిగా తీసుకున్నారు. ఇప్పుడు తన గ్రూప్‌లో సచిన్‌ను కూడా చేర్చుకోవాలని ఆయన కోరుతున్నారని తెలుస్తోంది.

రవిశాస్త్రి పంతం మేరకు భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ ఎంపికవ్వగా.. ఇప్పటివరకు బ్యాటింగ్‌ కోచ్‌గా పని చేస్తున్న సంజయ్‌ బంగర్‌కు అసిస్టెంట్‌ కోచ్‌ హోదా దక్కింది. ఇక ఆర్‌. శ్రీధర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా కొనసాగుతారు. ఈమేరకు బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రవిశాస్త్రి సూచనల మేరకు వీరి నియామకాలకు బీసీసీఐ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. రవిశాస్త్రితో పాటు ఈ ముగ్గురి పదవీ కాలం కూడా 2019 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు ఉంటుంది. గతంలో రవిశాస్త్రి డైరెక్టర్‌గా ఉన్న సమయంలో కూడా ఈ ముగ్గురే ఆయనతో కలిసి పని చేశారు.

ఇక వార్షిక వేతనం విషయంలోనూ విజయం రవిశాస్త్రినే వరించింది. భారత జట్టు హెడ్‌ కోచ్‌గా ఆయనకు ఏడాదికి రూ. 7.5 కోట్ల వరకు వేతనంగా చెల్లించేందుకు బీసీసీఐ అంగీకరించింది. గత కోచ్‌ కుంబ్లేకు (రూ. 6.5 కోట్లు) ఇచ్చిన దానికంటే ఇది మరింత ఎక్కువ కావడం విశేషం. భరత్‌ అరుణ్, సంజయ్‌ బంగర్, శ్రీధర్‌లకు రూ. 2 నుంచి రూ. 3 కోట్ల మధ్య దక్కే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు