ఆ ఎంపీకి మళ్లీ రైలే గతి

29 Mar, 2017 08:14 IST|Sakshi
ఆ ఎంపీకి మళ్లీ రైలే గతి

ఎయిరిండియా విమానంలో వెళ్లాలని ఎంతలా ప్రయత్నించినా శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పాచికలు పారలేదు. చివరకు ఆయన రైల్లోనే వెళ్లాల్సి వచ్చింది. ముంబై నుంచి బుక్‌ చేసుకున్న టికెట్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను కూడా ఎయిరిండియా రద్దు చేసేసింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఢిల్లీ వెళ్లారు. విమానం ఎక్కనివ్వకపోవడం సరికాదని, ఇలా ఒక ప్రయాణికుడిని.. అందునా ఎంపీని నిషేధించడం తగదని పార్లమెంటులో ఎన్ని చర్చలు జరిగినా ఎయిరిండియా మాత్రం ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రవీంద్ర గైక్వాడ్‌ను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదని పట్టుబట్టింది. దాంతో.. ఆయన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ స్లీపర్ బోగీలో టికెట్ బుక్ చేసుకుని ముంబై నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆ రైలు ముంబైలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు బయల్దేరి ఢిల్లీకి బుధవారం ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది.

గడిచిన నాలుగు రోజుల్లో రవీంద్ర గైక్వాడ్ ఇలా రైల్లో వెళ్లడం ఇది రెండోసారి. ఎయిరిండియా మేనేజర్ సుకుమార్ (60)ని 25 సార్లు చెప్పుతో కొట్టడంతో పాటు మెట్ల మీద నుంచి కిందకు తోసేయడంతో ఎయిరిండియా వర్గాలు గైక్వాడ్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఒక ప్రయాణికుడిని ఎక్కించుకోవాలా వద్దా అనే విషయంలో ఎయిరిండియాదే పూర్తి నిర్ణయాధికారమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటులో చెప్పారు. తనకు ఓపెన్ బిజినెస్ క్లాస్ టికెట్ ఉన్నా, ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి రావడమే ఎంపీ ఆగ్రహానికి కారణమని తెలిసింది. ఎంపీకి జరిగిన అవమానానికి నిరసనగా శివసేన సోమవారం నాడు ఉస్మానాబాద్‌లో బంద్ నిర్వహించింది.

>
మరిన్ని వార్తలు