ఆర్బీఐ ఆ నోట్లను రద్దెప్పుడు చేసిందో తెలుసా?

29 Dec, 2016 13:31 IST|Sakshi
ఆర్బీఐ ఆ నోట్లను రద్దెప్పుడు చేసిందో తెలుసా?
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగం. ఈ ప్రసంగానికి కొన్ని గంటల ముందే అంటే సాయంత్రం 5.30 గంటలకే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించేసిందట. అయితే ఈ విషయానికి ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది అనుకూలించారో మాత్రం ఆర్బీఐ రికార్డు చేయలేదు. సమాచార హక్కు చట్టం కింద కోరిన ప్రశ్నలకు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించిందని బ్లూమ్బర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది. నవంబర్ ఎనిమిదిన బోర్డు మీటింగ్ నిర్వహించిన ఆర్బీఐ సాయంత్రం 5.30 గంటలకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించిందని ఆర్టీఐలో వెల్లడైంది. అనంతరం ప్రధాని రాత్రి ప్రసంగంలో తెలిపారు. 
 
బ్యాంకు బోర్డు మీటింగ్లో గవర్నర్ ఉర్జిత్ పటేల్, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు. ఆర్. గాంధీ, ఎస్ఎస్ ముంద్రా, వీఎస్ విశ్వనాథన్లతో పాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ వంటి పలువురు ప్రముఖులున్నారు. అయితే కరెన్సీ రద్దుతో  ఏర్పడే నగదు కొరతకు  ఆర్బీఐ ఎలాంటి చర్యలు ప్లాన్స్ సిద్ధం చేసుకుందో ఆర్బీఐ తెలుపలేదు. రోజుకు ఎన్ని కొత్త రూ.500, రూ.2000 నోట్లు ప్రింట్ చేస్తున్నారనే దానిపై కూడా ఆర్బీఐ సమాధానం చెప్పలేదు.

పెద్ద నోట్లు రద్దయి 50 రోజులు గడుస్తున్నా ఇంకా నగదు కొరత సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరీక్షిస్తూనే ఉన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని నిరుపయోగంగా మార్చేస్తూ పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పలు పరిణామాల్లో ఆర్బీఐ పలు సార్లు తడబడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆర్బీఐ పలు విమర్శలు ఎదుర్కొంటుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో సెంట్రల్ బ్యాంకు స్వతంత్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు.  
మరిన్ని వార్తలు