ఉర్జిత్ పటేల్ అంతా వివరిస్తారట!

20 Dec, 2016 07:33 IST|Sakshi
ఉర్జిత్ పటేల్ అంతా వివరిస్తారట!
న్యూఢిల్లీ : పాత నోట్ల రద్దుపై ఆర్బీఐ మాటైనా మాట్లాడటం లేదని,  దాని ప్రభావంపై కనీసం వివరణ ఇచ్చేందుకు కూడా గవర్నర్ ఉర్జిత్ పటేల్ ముందుకు రావడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఉర్జిత్ పటేల్. డిసెంబర్ 22న పాత నోట్ల రద్దు, దాన్ని ప్రభావంపై పూసగుచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ ఆన్ ఫైనాన్స్ ముందు వివరించనున్నారు. పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్లో గురువారం ఉదయం 11 గంటలకు ఉర్జిత్ పటేల్ బ్రీఫింగ్ ప్రారంభమవుతుందని పార్లమెంట్ వెబ్సైట్ పేర్కొంది. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో వెసులుబాటులను ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే.  
 
సర్వీసు పన్నుల్లో రాయితీలు, డిజిటల్ పేమెంట్లు సులభతరం చేసేందుకు పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ నగదుతో జరిగే లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రజలకు నగదు కొరత తీర్చడానికి సిస్టమ్లోకి మళ్లీ కొత్త రూ.2000, రూ.500 నోట్లను, చిన్న డినామినేషన్ నోట్లను ఆర్బీఐ ప్రవేశపెడుతోంది. కానీ  చిల్లర దొరకక ఓ వైపు, నగదు కొంతమంది చేతుల్లోకి వెళ్లి మరోవైపు సాధారణ ప్రజానీకం కష్టాలు ఎదుర్కొంటున్నారు. స్వల్పకాలంలో కష్టాలు ఎదుర్కొన్నా, పాత నోట్ల రద్దు దీర్ఘకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. ఆర్బీఐ వద్ద కూడా సరిపడ నగదు ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సినవసరం లేదని పేర్కొంటోంది. ఈ విషయాలన్నింటిపై ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని వార్తలు