సమస్యాత్మక బ్యాంకులకూ కేంద్రం మూలధనం: రాజన్

10 Apr, 2015 02:52 IST|Sakshi
సమస్యాత్మక బ్యాంకులకూ కేంద్రం మూలధనం: రాజన్

 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని సమస్యాత్మక బ్యాంకులకూ అవసరమైతే కేంద్రం నుంచి తగిన మూలధనం అందుతుందని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్  రాజన్ పేర్కొన్నారు. పనితీరు ఆధారంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం అందజేయడం జరుగుతుందన్న విధానం నేపథ్యంలో గవర్నర్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సమస్యాత్మకంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు అసలు కేంద్రం నుంచి మూలధనమే అందదని భావించడం తగదు. సంబంధిత నిధులను ఎందుకు వినియోగిస్తున్నారన్న విషయాన్ని సంతృప్తికరమైన రీతిలో తెలియజేస్తే,
 
  ఆ బ్యాంకులకూ (సమస్యాత్మక) ప్రభుత్వం మూలధనాన్ని అందిస్తుంది’ అని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ అన్నారు. బలహీన బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులను సమీకరించుకోవడం కష్టం కనుక, తగిన ప్రణాళికను వివరిస్తే, కేంద్రం నుంచి అవసరమైన మూలధనం అందుతుందని తెలిపారు. కాగా ‘భారత్ క్రెడిట్ రేటింగ్’ అవుట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు పెంచుతూ... మూడీస్ తీసుకున్న నిర్ణయాన్ని   ఒక ‘సానుకూల దృక్పథం’గా రాజన్ అభివర్ణించారు. అయితే ప్రభుత్వం, నియంత్రణా సంస్థలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఈ విషయంపై దృష్టి పెట్టడం మరచిపోకూడదని అన్నారు.
 

>
మరిన్ని వార్తలు