డేగలు.. గుడ్లగూబ పోలికలు వద్దు...

30 Jan, 2014 01:20 IST|Sakshi
డేగలు.. గుడ్లగూబ పోలికలు వద్దు...

ముంబై: ప్రజా ప్రయోజనాల కోసమే రెపో రేటును పావుశాతం పెంచినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన విశ్లేషకులతో సాంప్రదాయక పాలసీ సమీక్ష అనంతర సమావేశంలో మాట్లాడారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను 8 శాతానికి పెంచడాన్ని  ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. తాను అనుసరిస్తున్న ద్రవ్యవిధానాన్ని  ‘యుద్ధోన్మాద డేగ’తో పోల్చుతున్న విశ్లేషకులు, ఆర్థికవేత్తలను  ఈ సందర్భంగా తప్పుపట్టారు.

 ఆర్థిక రంగానికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు... క్లుప్తంగా ఆయన మాటల్లోనే...
     అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ద్రవ్యోల్బణం గురించి మాట్లాడడమే కాదు. దీని కట్టడికి సైతం మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

     {దవ్యోల్బణం కట్టడిని మాత్రమే ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుందనడం సరికాదు. వృద్ధికి సైతం ప్రాముఖ్యత నిస్తుంది. అయితే ద్రవ్యోల్బణం కట్టడి ద్వారానే వృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం ప్రజాప్రయోజనాలకు కీలకం. ద్రవ్యోల్బణం కట్టడి ద్వారా దేశీయ కరెన్సీ విలువను పటిష్టంగా ఉంచడం మా ధ్యేయం. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తే- పెట్టుబడిదారు విశ్వాసం కూడా దానంతనే అదే బలపడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి అటు ద్రవ్యపరంగా, ఇటు రాజకీయ పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

     పాలసీ విధానాన్ని డేగతోనో లేక పావురంతోనో పోల్చడాన్ని పక్కనపెట్టండి. ముఖ్యమైన అంశం ఏమిటంటే- బలహీన ఆర్థిక వ్యవస్థలో తగిన బాటను వేయడానికి మేము ప్రయత్నిస్తున్నామన్నది ఇక్కడ ముఖ్యం. విస్తృతశ్రేణిలో ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

     మొత్తంగా చూస్తే మామీద ఒక ముద్ర వేసేయడానికి ప్రయత్నించకండి. ఆర్థిక వ్యవస్థకు ఏమికావాలో అదే చేస్తున్నాం.

     పాలసీ సమీక్ష రోజున విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు రాజన్ సమాధానం చెబుతూ... ‘ మేం డేగలం, పావురాలము కాదు. ఒక రకంగా చెప్పాలంటే గుడ్లగూబలం’ అని అన్నారు. గుడ్లగూబ వివేకానికి గుర్తని డిప్యూటీ గవర్నర్ ఇన్‌చార్జ్ (పరపతి విధానం) ఉర్జిత్ పటేల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు