రేపటి పాలసీలో ఉర్జిత్ ముందున్న సవాళ్లివే!

12 Dec, 2016 14:48 IST|Sakshi
రేపటి పాలసీలో ఉర్జిత్ ముందున్న సవాళ్లివే!
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండో మానిటరీ పాలసీ ప్రకటన బుధవారం వెలువడబోతోంది. రేపటి పాలసీ సమీక్షలో కీలక రెపో రేటును ఆర్బీఐ 0.25 శాతం కోత విధిస్తుందని పలువురు అంచనావేస్తుండగా.. ఈ కోత 0.50 శాతం వరకు ఉంటుందని మరి కొంతమంది అంటున్నారు. పాత నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన అనంతరం వెలువడతున్న మొదటి పాలసీ ఇదే కావడంతో, రేట్ల కోతపై అంచనాలు భారీగానే ఉన్నాయని వెల్లడవుతోంది.. దీంతో పాలసీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో రోజుల భేటీ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేటి నుంచి ప్రారంభమైంది. రేపు మధ్యాహ్నం 2.30లకు రేట్ల కోతపై ఆర్బీఐ నిర్ణయం వెలువరుస్తుంది. ఈ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని మానిటరీ పాలసీ కమిటీ ముందున్న సవాళ్లేమిటో ఓ సారి చూద్దాం....
 
1. ఆర్థికవేత్తల ప్రకారం డీమానిటైజేషన్ కనీసం వచ్చే రెండో త్రైమాసికాల్లో కచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవస్థను ఊపందుకునేలా చేయడానికి మానిటరీ పాలసీ కమిటీ ఏ మేరకు రేట్లలో కోత విధించాలో నిర్ణయించాల్సి ఉంటుంది. అది పావు శాతమో, అరశాతమో వచ్చే రెండో క్వార్టర్లలో పడబోయే నెగిటివ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వారు అంచనావేయనున్నారు. 
 
2. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వు నుంచి ఈ నెలలో షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల చివరిలో ప్రకటించబోయే ఫెడ్ పాలసీలో కచ్చితంగా రేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ భారీగా క్షీణిస్తోంది. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న రేట్ల కోత నిర్ణయం కూడా రూపాయిపై ప్రతికూలం ప్రభావం చూపనుంది. 
 
3. అదేవిధంగా 2008 తర్వాత మొదటిసారి చమురు మార్కెట్ సమతుల్యం కోసం ఆయిల్ ఉత్పత్తిలో కోత విధించనున్నట్టు  ఒపెక్ సభ్యులు ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయంతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే ఈ ధర పెరుగుదలను మానిటరీ పాలసీ కమిటీ పరిగణలోకి తీసుకోనుంది. 
 
4. డీమానిటైజేషన్ తర్వాత మొదటిసారి ఆర్బీఐ చీఫ్‌ ఉర్జిత్ పటేల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో పాత నోట్ల రద్దు ప్రక్రియలో ఆర్బీఐ పాత్ర, పెద్ద నోట్ల రద్దుకు ఆర్బీఐ ముందస్తుగా ఎలాంటి ప్లానింగ్ చేపట్టిందనే పలు ప్రశ్నలను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
 
5.  గత పాలసీలో ఆరుగురు సభ్యుల మానిటరీ కమిటీ ఏకగ్రీవంగా 25 బేసిక్ పాయింట్ల రెపో రేటు కోతకు అంగీకరించింది. కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈసారి కూడా ఏకగ్రీవంగా రేట్ల కోతకు మొగ్గుచూపుతారా? లేదా? అనేది సందిగ్థత నెలకొంది. 
>
మరిన్ని వార్తలు