నేడే ఆర్‌బీఐ విధాన సమీక్ష

7 Apr, 2015 01:02 IST|Sakshi
నేడే ఆర్‌బీఐ విధాన సమీక్ష

 ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం వార్షిక  ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ నేపథ్యంలో విశ్లేషకుల్లో విభిన్న అంచనాలు వెలువడ్డాయి. ప్రస్తుతానికి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం)లో ఎటువంటి మార్పూ ఆర్‌బీఐ చేయకపోవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జూన్ నాటికి మరో 25 బేసిస్ పాయింట్ల కోత ఉండవచ్చని సైతం వారు అంచనా వేస్తున్నారు.
 
  కాగా బ్యాంకులకు తగిన నిధులు అందుబాటులో ఉంచడానికి  వీలుగా స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోను(ఎస్‌ఎల్‌ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన పరిమాణం- ప్రసుత్తం ఇది  21.5%)  తగ్గించే అవకాశం ఉందని మరికొందరు విశ్లేషకుల అంచనా. దీనివల్ల బ్యాంకింగ్‌లో నిధుల సమీకరణ, మార్జిన్లకు సంబంధించి ఒత్తిడి తగ్గే అవకాశం, తద్వారా రుణ రేట్లు తగ్గించే వెసులుబాటు ఉందని భావిస్తున్న ఆర్‌బీఐ, తాజాగా ఈ దిశలో నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తత్సం బంధ అంశాల ప్రాతిపదికన ఆర్‌బీఐ పాలసీ సమీక్ష ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు