చేయాల్సింది చేశాం... ఫలితానికి వేచిచూస్తాం

31 Oct, 2013 02:17 IST|Sakshi
చేయాల్సింది చేశాం... ఫలితానికి వేచిచూస్తాం

ముంబై: ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆరు వారాల వ్యవధిలో రెండుసార్లు రెపోరేట్ల పెంపు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం స్పందించారు. దేశ ఆర్థికరంగం పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరపతి, ద్రవ్య విధాన పాలసీ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఫలితంపై వేచిచూస్తామని తెలిపారు. పాలసీ అనంతరం సాంప్రదాయకంగా ఆర్థిక విశ్లేషకులతో జరిగే సమావేశంలో మాట్లాడుతూ రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 రూపాయిపై ఇలా...
 రూపాయి స్థిరత్వంపై ఆయన మాట్లాడుతూ, చమురు కంపెనీల నుంచి డాలర్ల డిమాండ్ మామూలు మార్కెట్ పరిస్థితులకు చేరినప్పుడే మన కరెన్సీ స్థిరత్వాన్ని ఆపాదించుకుందని చెప్పడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రూపాయి ఈ స్థాయివద్ద ఉండాలనే విషయంలో ఒక నిర్దిష్ట అభిప్రాయాన్నేదీ లేదన్నారు.
 
 ద్రవ్యలభ్యతపై విశ్లేషణ
  లిక్విడిటీ తగిన స్థాయికి వస్తే, రుణాలకు బ్యాంకులు ఎంఎస్‌ఎఫ్ నుంచి రెపోకు మారే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇప్పటికీ వ్యవస్థ ఎంఎస్‌ఎఫ్ విండో ద్వారా బ్యాంకింగ్ రుణాలను తీసుకుంటున్న విషయాన్ని రాజన్ పేర్కొన్నారు.  ద్రవ్య లభ్యత వ్యవస్థలో పెరగడానికి పలు మార్గాలు ఉన్నాయని సైతం ఆయన వివరించారు. ప్రభుత్వ వ్యయాల పెంపు, ఓఎంఓ (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్- బాండ్ల కొనుగోళ్లు), డిపాజిట్ల వృద్ధి వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
 
 కఠిన పాలసీపై వివరణ
  ప్రస్తుత అంతర్జాతీయ అస్పష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ద్రవ్య విధాన కొనసాగింపునకు ఒక కాల వ్యవధిని నిర్దేశించుకోలేమని ఆయన అన్నారు.  ఒకవేళ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక చర్యలను వెనక్కు తీసుకునేట్లయితే, ఆ పరిస్థితిని ఎదుర్కొనే స్థాయిలో భారత్ ఉందని మాత్రం ఆయన సందర్భంగా భరోసాను ఇచ్చారు.
 
 క్యాడ్, ఆహార భద్రతపై కామెంట్:  కరెంట్ అకౌంట్ లోటు కట్టడిలోనే ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఆహార భద్రతా బిల్లు అమలు గురించి ఆయన మాట్లాడారు. ఆహార సబ్సిడీ భారం ప్రస్తుతం జీడీపీలో ఒకశాతం ఉందన్నారు. ఆహార భద్రతా బిల్లు కూడా అమల్లోకి వస్తే ఇది 1.5 శాతానికి చేరుతుందని వివరించారు. అయితే ఇంధన సబ్సిడీల భారం తగ్గింపు ద్వారా ఈ అదనపు భారాన్ని అధిగమించే అవకాశం ఉందని సూచించారు.  
 

మరిన్ని వార్తలు