వడ్డీరేట్ల పిడుగు!

29 Jan, 2014 15:10 IST|Sakshi
వడ్డీరేట్ల పిడుగు!

అంచనాలన్నీ తలకిందులయ్యాయి... గృహ, వాహన రుణాలపై నెలవారీ వాయిదా(ఈఎంఐ)లు మరింత భారమయ్యేలా రుణ గ్రహీతలపై వడ్డీరేట్ల పిడుగుపడింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ తన రూటే సెప‘రేటు’ అని మరోసారి నిరూపిస్తూ... అనూహ్యంగా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించారు. ద్రవ్యోల్బణం కట్టడే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

అసలే వడ్డీరేట్ల భారం, వృద్ధి మందగమనంతో అల్లాడుతున్న పారిశ్రామిక రంగానికి ఆర్‌బీఐ తాజా చర్యలు మింగుడుపడటం లేదు. పరిశ్రమలు మరింత తిరోగమనంలోకి జారిపోతాయంటూ కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే, రానున్న కాలంలో మరిన్ని రేట్ల పెంపులకు ఆస్కారం ఉండకపోవచ్చనిఆర్‌బీఐ సంకేతాలివ్వడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం.
 
 ముంబై: ద్రవ్యోల్బణంపై రఘు‘రామ’ బాణం మరోసారి దూసుకెళ్లింది. మంగళవారం చేపట్టిన మూడో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడున్న 7.75% నుంచి 8 శాతానికి ఎగసింది. రెపోతో ముడిపడి ఉన్న రివర్స్ రెపో కూడా పావు శాతం పెరిగి 7 శాతానికి చేరింది. అదేవిధంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 8.75 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది.

అయితే, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని మాత్రం యథాతథంగా ఇప్పుడు 4%గానే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. తాజా చర్యలతో రుణాలపై వడ్డీరేట్లకు రెక్కలొస్తాయని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకర్లు తక్షణం రేట్ల పెంపుపై నిర్ణయం ప్రకటించనప్పటికీ.. త్వరలోనే చర్యలు ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం.

 మూడో‘సారీ’...
 వాస్తవానికి డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం భారీగా దిగిరావడంతో ఈసారి పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచొచ్చని అధిక శాతం మంది బ్యాంకర్లు, ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. కొంతమంది రేట్ల కోతకూ ఆస్కారం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అయితే, రాజన్ మాత్రం అందరూ అవాక్కయ్యేలా మరోసారి ‘వడ్డి’ంపు ప్రకటించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఐదు నెలల్లో మూడుసార్లు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం.

 సెప్టెంబర్, నవంబర్‌లలో చేపట్టిన పరపతి విధాన సమీక్షల్లో రెపో రేటు పావు శాతం చొప్పున పెంచారు. అయితే, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో డిసెంబర్ సమీక్షలో కచ్చితంగా రేట్ల పెంపు ఉండొచ్చని అందరూ భావించగా... అప్పుడు అనూహ్యంగా పాలసీ రేట్ల జోలికివెళ్లలేదు. ఈసారి కూడా అంచనాలను తలకిందులు చేశారు ఆర్‌బీఐ చీఫ్. డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 9.87 శాతానికి(మూడు నెలల కనిష్టం), టోకు ధరల ద్రవ్యోల్బణం 6.16 శాతానికి(ఐదు నెలల కనిష్టస్థాయి) శాంతించడం తెలిసిందే. కాగా, తాజా సమీక్షలకు కొద్దిరోజుల ముందు ద్రవ్యోల్బణాన్ని ఒక వినాశకర వ్యాధిగా రాజన్ అభివర్ణించడం తెలిసిందే. ధరలను కట్టడి చేస్తేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

 కార్పొరేట్ల గగ్గోలు...
 వడ్డీరేట్లు తగ్గించాలన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా మరోసారి ఆర్‌బీఐ రేట్లను పెంచడంపట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆర్‌బీఐ చర్యలను సాకుగాచూపి బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకోరాదని... ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ రికవరీని తీవ్రంగా దెబ్బతీస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికంటే వృద్ధి, పెట్టుబడుల పెంపుపై ఆర్‌బీఐ దృష్టిపెట్టడం ముఖ్యమని అభిప్రాయపడింది. ‘వృద్ధి ఇంకా మందగమనంలోనే ఉంది.

 గత రెండేళ్లుగా పెట్టుబడులు పడిపోవడంతో అన్ని రంగాల పరిశ్రమల్లోనూ ఉద్యోగావకాశాలు క్షీణించిన సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పారిశ్రామికోత్పతి తిరోగమనంలోకి జారిపోయిన తరుణంలో మళ్లీ దీన్ని గాడిలోపెట్టారంటే వడ్డీరేట్ల తగ్గింపు ఇతరత్రా విధానపరమైన మద్దతు చాలా అవసరం. రానున్న నెలల్లో ఆర్‌బీఐ వృద్ధి, ఉద్యోగకల్పనపై ప్రధానంగా దృష్టిపెడుతుందని భావిస్తున్నాం’ అని ఫిక్కీ వ్యాఖ్యానించింది.
 
 పాలసీలో ఇతర ముఖ్యాంశాలివీ..
 
     ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఆందోళనకరం. ఈ ఏడాది(2013-14) మూడో త్రైమాసికం(క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి మరింత నెమ్మదించొచ్చు.

     ఈఏడాది జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపే ఉండొచ్చు. గత అంచనా 5.5 శాతం.
     2014-15లో మాత్రం వృద్ధి రేటు  కాస్త మెరుగ్గా 5.5 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నాం.
     కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఈ ఏడాది జీడీపీలో 2.5% లోపే ఉండొచ్చు. గతేడాది ఇది చరిత్రాత్మక గరిష్ట స్థాయిని(4.8%) తాకింది.

     రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో 9 శాతం పైనే ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది క్యూ4లో 7.5-8.5% స్థాయిలో ఉండొచ్చు. రేట్ల పెంపుతో ద్రవ్యో ల్బణం ఒత్తిళ్లు తగ్గుతాయి.

     {దవ్యోల్బణం పెరుగుదల అనేది అనవసరమైన పన్నుపోటుగా మారుతోంది. పేద ప్రజలను ఇది తీవ్రంగా కుంగదీస్తోంది.

     ఇక నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి పాలసీ సమీక్ష చేపట్టాలని నిర్ణయం(ఇప్పటిదాకా నెలన్నర రోజులకు ఒకసారి ఉంది). తదుపరి పరపతి విధాన సమీక్ష ఏప్రిల్ 1 ఉంటుంది.
 
 
 ఆర్‌బీఐ అస్త్రాలు..
 
 రెపో రేటు: బ్యాంకుల వద్ద నిధుల కొరత గనుక ఉంటే అవి ఆర్‌బీఐ నుంచి నగదును స్వల్పకాలిక రుణంగా తీసుకోవచ్చు. ఇటువంటి రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. రెపో రేటును పెంచితే బ్యాంకులు తీసుకునే ఈ స్వల్పకాలిక రుణాలు ఖరీదవుతాయి.
 రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. రివర్స్ రెపో రేటు ఆకర్షణీయంగా ఉంటే గనుక, ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు తమ అదనపు నిధులను ఉంచేందుకు ఇష్టపడతాయి.
 సీఆర్‌ఆర్: బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా నిర్దిష్ట శాతంలో ఉంచాల్సిన నిధుల మొత్తమే సీఆర్‌ఆర్.
 ఎంఎస్‌ఎఫ్: స్వల్పకాలిక రుణాల వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులను నివారించేందు కోసం ఆర్‌బీఐ ఈ ఎంఎస్‌ఎఫ్‌ను ప్రవేశపెట్టింది. రెపో రేటు కన్నా 100 బేసిస్ పాయింట్లు(1%) ఎక్కువగా ఉంటుంది.
 
 
 రిటైల్ ద్రవ్యోల్బణంపై దృష్టి....
 
 రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. దీన్ని తగ్గించడంలో భాగంగానే మరోవిడత రెపో రేటును పెంచాల్సి వచ్చింది. రానున్న పాలసీ సమీక్షల్లో నిర్ణయాలన్నీ గణంకాలపైనే ఆధారపడి ఉంటాయి. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వచ్చే ఏడాది జనవరినాటికి 8 శాతం లోపునకు తీసుకురావాలనేది ఆర్‌బీఐ లక్ష్యం. అయితే, ఇది అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ మా అంచనాలకు అగుగుణంగా ద్రవ్యోల్బణం గనుక దిగొస్తే... సమీప భవిష్యత్తులో మరోవిడత రేట్ల పెంపునకు ఆస్కారం ఉండకపోవచ్చు. పాలసీ నిర్ణయాలకు ఇక నుంచి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలన్న ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సులను ఆర్‌బీఐ ఇంకా ఆమోదించలేదు. ఈ విధమైన మార్పులు చేసేముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.

రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం గణంకాలు రెండూ కీలకమే. అయితే, రిటైల్ ధరలు నేరుగా వినియోగదారులతో ముడిపడి ఉన్నందున దీనిపై కొంత అధిక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తేనే దీర్ఘకాలంలో నిలకడైన వృద్ధిరేటు కొనసాగేందుకు దోహదపడుతుంది. రెపో రేటు పెంపు వల్ల బ్యాంకుల వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు తక్కువే. ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉండాలంటే ముందుగా ధరలను దించాల్సిన అవసరం ఉంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం వల్లే బ్యాంకుల డిపాజిట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ధరలు దిగొస్తే.. డిపాజిట్, రుణ రేట్లు కూడా దిగొచ్చేందుకు అస్కారం లభిస్తుంది. - రఘురామ్ రాజన్, ఆర్‌బీఐ గవర్నర్

 వేచిచూస్తాం: బ్యాంకర్లు
 
 ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకర్లు ఆచితూచి స్పందించారు. రుణాలపై వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునేముందు ద్రవ్యోల్బణం ధోరణి, డిపాజిట్ రేట్లను మదింపు చేయాల్సి ఉందని ప్రభుత్వ, ప్రైవేటు రంగ  బ్యాంకుల అధిపతులు చెప్పారు.

ఎవరేమన్నారంటే...
 
 త్వరలో నిర్ణయం...
 డిపాజిట్, రుణ రేట్ల పెంపుపై నిర్ణయం కోసం బ్యాంకు యాజమాన్యం సమావేశం కానుంది. నిధుల సమీకరణ వ్యయంపై ఎలాంటి ప్రభావం ఉందన్నదానిపైనే రేట్లలో మార్పుచేర్పులు ఉంటాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డిపాజిటర్లకు తగిన వడ్డీని ఇవ్వాల్సి ఉంటుంది. రుణ గ్రహీతల నుంచి అధిక వడ్డీరేట్లను వసూలు చేసి.. డిపాజిటర్లకు అధిక వడ్డీని ఆఫర్ చేయలేం. ఈ మొత్తం పరిస్థితిని నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. - అరుంధతి భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
 అన్నీ చూశాకే...
 డిపాజిట్లు, ద్రవ్యోల్బణం వాస్తవ ధోరణులను సమీక్షించాలి. ఈ రెండే బ్యాంకుల నిధుల వ్యయంపై ప్రభావం చూపేవి. ఆతర్వాతే రుణ రేట్ల జోలికెళ్లడం సముచితం. డిపాజిట్ రేట్ల విషయంలో నిర్ణయానికి వచ్చేదాకా రుణాలపై వడ్డీ రేట్ల పెంపు విషయంలో తక్షణం ఎలాంటి చర్యలూ తీసుకోలేం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ
 రుణాలకు డిమాండ్‌నుబట్టే...
 బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలకు డిమాండ్, డిపాజిట్ల సమీకరణ వ్యయాలను పరిగణనలోకి తీసుకొని వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. - ఆదిత్య పురి, హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ, సీఈఓ
 ఆప్షన్లన్నీ సిద్ధం...
 ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంపై మార్కెట్లో ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తమవుతోందనేది పరిశీలించాలి. వడ్డీరేట్ల పెంపు సహా అన్ని ఆప్షన్లనూ సిద్ధంగా ఉంచుకొని కొంత వేచిచూసి నిర్ణయం తీసుకోవాలి. - కేఆర్ కామత్, పీఎన్‌బీ సీఎండీ
 

>
మరిన్ని వార్తలు