తాజా నిబంధనలను ఎత్తేసిన ఆర్బీఐ

21 Dec, 2016 13:50 IST|Sakshi
తాజా నిబంధనలను ఎత్తేసిన ఆర్బీఐ
ముంబై : డిపాజిట్దారులకు ఊరట కల్పిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తెలుసుకుంది. రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ తాజాగా తీసుకొచ్చిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. ఈ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ నోటీఫికేషన్ జారీచేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఈ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
 
రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే తగిన ఆధారాలు చూపించాంటూ ఈ నెల 19న ఆర్బీఐ ఓ సర్క్యూలర్ జారీచేసిన సంగతి తెలిసిందే. రూ.5000 కంటే ఎక్కువగా డిపాజిట్ చేసే వారు ఇన్ని రోజులు ఎందుకు డిపాజిట్ చేయలేదో ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో బ్యాంకులకు తెలపాల్సి ఉంటుంది. డిపాజిట్ దారులు చెప్పే సమాధానాలు బ్యాంకు సిబ్బందిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్‌ తీసుకుంటారు.  ప్రస్తుతం ఈ నిబంధన ఎత్తివేతతో కేవైసీ అకౌంట్లలో డిసెంబర్ 30 వరకు ఎంత మొత్తంలోనైనా  డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 8న పాత నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఆ నోట్లను డిసెంబర్ 30 వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది.
 
అయితే గడువు దగ్గర పడుతుండటంతో డిపాజిట్లపై పరిమితులను ఆర్బీఐ తీసుకొచ్చింది. కానీ బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లతో డిపాజిట్ చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలు తీసుకురావడమేమిటని దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తాజా నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది.