భారత్‌లో స్కోడా ఫాబియా రీ ఎంట్రీ

11 Mar, 2015 01:59 IST|Sakshi
భారత్‌లో స్కోడా ఫాబియా రీ ఎంట్రీ

త్వరలో ప్రీమియం ఎస్‌యూవీ కూడా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీ సంస్థ స్కోడా... తన హ్యాచ్ బ్యాక్ మోడల్ ఫాబియాను భారత్‌లో తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడం, 50-60 శాతం విడిభాగాలు దిగుమతి చేసుకోవాల్సి రావటం వల్ల ఖర్చులు తడిసిమోపెడై 2013లో ఫాబియా విక్రయాలను కంపెనీ నిలిపివేసింది. ప్రస్తుతం భారత్ మినహా పలు దేశాల్లో ఈ మోడల్ అందుబాటులో ఉంది. తిరిగి దీనిని భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ గట్టిగా అనుకుంటున్నా... ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం.

రీ ఎంట్రీ ఇవ్వనున్న ఫాబియాకు అత్యధిక విడిభాగాలను స్థానికంగానే సేకరించనున్నారు. కాగా, 2014లో దేశవ్యాప్తంగా అన్ని మోడళ్లూ కలిపి కంపెనీ 15,500 కార్లను విక్రయించింది. దీన్లో స్కోడా బేసిక్ మోడల్ అయిన ర్యాపిడ్ వాటా 70 శాతానికి పైగా ఉంది. ర్యాపిడ్ ధర హైదరాబాద్‌లో మోడల్‌ను బట్టి రూ.7.7 లక్షల నుంచి ఆరంభమవుతూ ఉండగా... అంతకన్నా తక్కువ ధర ఉన్న ఫాబియాను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అమ్మకాలు జోరందుకుంటాయని కంపెనీ భావిస్తోంది.

ప్రీమియం ఎస్‌యూవీ కూడా...
భారత్‌లో ప్రీమియం ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు స్కోడా ప్రాంతీయ సేల్స్ హెడ్ మహేశ్ తివారీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఫాబియా రీ ఎంట్రీని ధ్రువీకరించిన ఆయన... ఈ రెండూ ఎప్పుడు విడుదలవుతాయనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదన్నారు. ‘సూపర్బ్’ కొత్త మోడల్ 2016 ద్వితీయార్థంలో రానుందని తెలియజేశారు. జీల్ ఎడిషన్ మోడళ్లను ఆవిష్కరించేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 2015లో అమ్మకాల్లో 20-25 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు చెప్పారు. కంపెనీ ఇప్పటి వరకు భారత్‌లో 2 లక్షల కార్లను విక్రయించింది. అన్ని మోడళ్లకూ అదనపు హంగులను జోడించి జీల్ ఎడిషన్ పేరుతో విడుదల చేసింది.

మరిన్ని వార్తలు