ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ

28 Sep, 2015 07:21 IST|Sakshi
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ

నేడు పీఎస్‌ఎల్‌వీ సీ-30 ద్వారా ప్రయోగం..
ఖగోళ పరిశోధనల కోసం తొలి ప్రయత్నం

భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం, ఆదివారం వివిధ దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం రాత్రి రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశారు.
- శ్రీహరికోట/హైదరాబాద్
 
పదేళ్ల శ్రమ ఫలితమే ఆస్ట్రోశాట్..
ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇది. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి దీన్ని ప్రయోగిస్తున్నారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్‌ను ప్రయోగిస్తున్నారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ శాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు.  
 
ఇది ఆరంభం మాత్రమే...
ఆస్ట్రోశాట్ ఉపగ్రహ ప్రయోగం అంతరిక్ష పరిశోధకులకు మంచి అవకాశం అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇలాంటి శాస్త్రీయ ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. కిరణ్‌కుమార్ ఆదివారం షార్‌కు చేరుకుని పీఎస్‌ఎల్‌వీ సీ30 కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. మొదటి ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను పరిశీలించారు. అనంతరం సహచర శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రయోగ పనులను సమీక్షించారు.
 
విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో హాఫ్ సెంచరీ!
ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ సీ-30 ఆరు విదేశీ శాటిలైట్స్‌ను కూడా తీసుకెళుతోంది. ఇండోనేసియాకు చెందిన 76 కిలోల లపాన్-ఏ2, కెనడాకు చెందిన 14 కిలోల ఎన్‌ఎల్‌ఎస్14, అమెరికాకు చెందిన 28 కిలోల లీమూర్ అనే నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఈ ఆరు విదేశీ ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50 ని దాటుతుంది. ఇప్పటి వరకూ ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫీజు తీసుకుని ఇస్రో ఇలా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వస్తోంది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది మూడో సారి.

>
మరిన్ని వార్తలు