-

కీలక ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ఎలా?

4 Jan, 2017 16:24 IST|Sakshi
కీలక ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ఎలా?

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  ఎలక్షన కమిషన్ బుధవారం  నగారా  మోగించింది.  అయితే ఈ కీలక ఎన్నికలకు ముందు ఈ మాసాంతంలో నిర్వహించనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ను  ప్రవేశపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  ఫిబ్రవరి 1   కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం  యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశంపై తమకు  ప్రతిపక్షాలనుంచి అభ్యంతరాలు అందాయని ఎన్నికల కమిషన్ ఛైర్మన్ నసీం  జైదీ  మీడియాకు తెలిపారు.  ఈ మేరకు  ఫిర్యాదును పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీంతో  బడ్జెట్ సమర్పణ మార్చి 11వ తేదీకి తరువాతకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్న  వాదనలు వినిపిస్తున్నాయి.

నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఎన్నికల తేదీలు తదితర  కీలక ఘట్టాలకు సంబంధించిన వివరాలను నసీం ప్రకటించారు.  మార్చి 11 న అయిదు రాష్ట్రాల కౌంటింగ్ ను నిర్వహించనున్నారు.   అలాగే తాజా సుప్రీంకోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని  ఈసీ స్పష్టం చేసింది. మత, కులం పేరులో ఓట్లు అడగడం అవినీతి కిందికి వస్తుందన్న హిందుత్వ  కేసులో సుప్రీం  తీర్పును  కచ్చితంగా పాటిస్తామని ఈసీ  ఛైర్మన్ స్పష్టం చేశారు. అలాగే  ప్రతీ అభ్యర్తి  సోషల్ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలని  కూడా ఈసీ కోరింది.  ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా  అన్ని పార్టీలకు  కూడా విజ్ఞప్తి చేసింది.
మరోవైపు నిబంధనలను  మరింత కఠినతరం చేసిన ఈసీ అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చునూ నమోదు చేయాలని, దాన్ని నిత్యమూ అధికారులకు అందించాలని సూచించింది.   ఒక్క రూపాయి  నగదు ఖర్చును అంగీకరించేది లేదని స్పష్టం చేసింది.  ప్రతి అభ్యర్థీ విధిగా ఎన్నికల ఖాతాను ప్రారంభించాలని, దాని ద్వారానే   కేటాయింపులు జరపాలని ఆదేశించింది. సదరు ఖాతాలోని వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఈసీకి అందించాలని, ఒకవేళ బ్యాంకుల ద్వారా కాకుండా చెల్లింపులు జరపాల్సి వస్తే, చెక్కులు జారీ చేయాలని సూచించింది. రూ. 20 వేల కన్నా అధిక మొత్తంలో డొనేషన్లు వస్తే, అది చెక్కులు లేదా డీడీల రూపంలో మాత్రమే ఉండాలని పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ ఖర్చులపై పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ప్రకటించాలని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు