బలమైన కేసు ఎందుకు పెట్టలేదు?

7 Sep, 2015 12:33 IST|Sakshi
బలమైన కేసు ఎందుకు పెట్టలేదు?

జైపూర్/డెహ్రడూన్: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వనున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లలిత్ ను తమకు అప్పగించాలని బ్రిటన్ ను కోరనున్నామని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే లలిత్ మోదీని స్వదేశానికి రప్పించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సవాల్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

లలిత్ ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాథోడ్ తెలిపారు. రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. లలిత్ మోదీ విదేశాలకు పారిపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

ఆయనపై బలమైన కేసు పెట్టివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. ఫెమా కేసు మాత్రమే పెట్టి యూపీఏ ప్రభుత్వం చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు. ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేదని, ఎక్కువ శిక్ష కూడా పడదని తెలిపారు. లలిత్ గేట్ వివాదంపై ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు