కేరళలో అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్టు

21 Sep, 2015 22:39 IST|Sakshi

చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో భాగంగా చిత్తూరు పోలీసులు ఓ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంకు చెందిన అచ్చిపార లతీఫ్ (39) అనే స్మగ్లర్‌ను సోమవారం మన్నార్‌కాడ్‌లో అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు అక్కడి న్యాయస్థానంలో నిందితున్ని హాజరుపరచి చిత్తూరుకు తీసుకొస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని  పాలక్కాడ్ జిల్లా  పల్లికాన్ను పోస్టుకు చెందిన లతీఫ్‌పై జిల్లాలో 13కు పైగా కేసులు ఉన్నాయి. ఇతను 2004 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడు.

తొలుత డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతను, దాని తరువాత చేపల వ్యాపారం చేస్తూ అక్కడ రాణించక ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. గత ఆరేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న ఇతను వెయ్యి టన్నులకుపైగా ఎర్రచందనాన్ని సింగపూర్, చైనా, దుబాయ్‌లకు స్మగ్లింగ్ చేశాడు. ఇటీవల జిల్లాలో పట్టుబడ్డ పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు కేరళలో ఉన్న లతీఫ్‌ను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో సీఐలు చంద్రశేఖర్, ఆదినారాయణరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు