తగ్గిన ముస్లింలు.. పెరిగిన హిందువులు

27 Aug, 2015 03:35 IST|Sakshi
తగ్గిన ముస్లింలు.. పెరిగిన హిందువులు

సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో హిందువుల సంఖ్య రెండుశాతం పెరగగా, ముస్లింల సంఖ్య ఒక శాతానికి పైగా తగ్గింది. కేంద్ర జనగణన విభాగం చేపట్టిన 2011 జనాభా లెక్కలతో నిరుడు తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే మతాల వారీగా జనాభాలో హెచ్చుతగ్గులిలా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని పది జిల్లాల్లో మొత్తం జనాభా 3.51 కోట్లు. గతేడాది ఆగస్టు 19న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో మొత్తం 3.63 కోట్ల మంది జనాభా ఉన్నట్లు లెక్కతేలింది.

అదే సర్వేలో మతాల వారీగా కుటుంబాల వివరాలను సైతం ప్రభుత్వం సేకరించింది. కుటుంబాలకు, జనాభాకు స్వల్ప వ్యత్యాసమే ఉంటుందని.. ఇంచుమించుగా ఇదే ఫలితాలు ప్రతిబింబిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 87.17 శాతం హిందువుల కుటుంబాలున్నాయి. 2011 లెక్కల ప్రకారం హిందువులు 85.09 శాతం మంది ఉండడం గమనార్హం. దీంతో నాలుగేళ్లలో హిందువులు 2.08 శాతం పెరిగినట్లు అర్థమవుతోంది.

ముస్లింలు 2011లో 12.65 శాతం ఉండగా, సమగ్ర సర్వే ప్రకారం 11.01 శాతం ఉన్నారు. అంటే 1.64 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది. క్రిస్టియన్ల సంఖ్యలో మార్పేమీ లేకపోవడం గమనార్హం. 2011 లెక్కల ప్రకారం 1.27 శాతం క్రిస్టియను ఉన్నారు. సిక్కులు 0.15 శాతం, జైనులు 0.06 శాతం, బుద్ధులు 0.05 శాతం ఉన్నట్లు తేలింది. 2011తో పోలిస్తే ఈ మూడు మతాల జనాభా స్వల్పంగా పెరిగింది.

>
మరిన్ని వార్తలు