రిలయన్స్ లాభం రూ.5,511 కోట్లు

18 Jan, 2014 00:46 IST|Sakshi
రిలయన్స్ లాభం రూ.5,511 కోట్లు

 న్యూఢిల్లీ: దేశీయ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా వున్నాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్(2013-14, క్యూ3)లో రూ. 5,511 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,502 కోట్ల లాభంతో పోలిస్తే వృద్ధి నామమాత్రంగా 0.2 శాతానికే పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 96,307 కోట్ల నుంచి రూ.1,06,383 కోట్లకు పెరిగింది. 10.5 శాతం వృద్ధి చెందింది. ఇక సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2)తో పోల్చినా(రూ.5,490 కోట్లు) కూడా సీక్వెన్షియల్‌గా లాభంలో వృద్ధి 0.4 శాతమే. ఆదాయం స్వల్పంగా 0.1 శాతం క్షీణించింది. రూ.1.065 లక్షల కోట్ల నుంచి రూ. 1.063 లక్షల కోట్లకు తగ్గింది. అయితే, విశ్లేషకులు క్యూ3లో లాభం సగటున రూ. 5,300-5,350 కోట్లకు తగ్గొచ్చని అంచనా వేశారు. దీని ప్రకారం చూస్తే ఆర్‌ఐఎల్ లాభాలు కాస్త మెరుగ్గా ఉన్నట్లే లెక్క. నాన్-కోర్(పెట్రోలియం, పెట్రోకెమికల్స్ ప్రధాన వ్యాపారం కాకుండా) బిజినెస్ ఆదాయాలు పుంజుకోవడం కంపెనీకి చేయూతనందించాయి.
 
 జీఆర్‌ఎంలు ఇలా...
 కంపెనీ స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) ఈ ఏడాది క్యూ3లో ఒక్కో బ్యారెల్‌పై 7.6 డాలర్లకు తగ్గింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఇది 9.6 డాలర్లు కాగా, సెప్టెంబర్ క్వార్టర్లో 7.7 డాలర్లుగా నమోదైంది. పరిశ్రమ విశ్లేషకుల సగటు అంచనా 7.5 డాలర్లు. ఒక్కో బ్యారెల్ ముడిచమురును శుద్ధి చేయడం ద్వారా వచ్చే పెట్రో ఉత్పత్తులపై కంపెనీకి లభించే లాభాన్నే జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. అయితే, ప్రామాణిక సింగపూర్ సగటు జీఆర్‌ఎం కంటే తమ మార్జిన్లు మెరుగ్గానే ఉన్నాయని ఆర్‌ఐఎల్ చెబుతోంది.
 
 భారీ ఇతర ఆదాయం ఆసరా...

  క్యూ3లో ఆర్‌ఐఎల్‌కు ఇతర ఆదాయం రూపంలో రూ. 2,305 కోట్లు లభించాయి. ఈ ఆదాయం క్యూ2తో(రూ. 2,060 కోట్లు) పోలిస్తే 12 శాతం పెరిగింది. అదే క్రితం ఏడాది క్యూ3లో రూ. 1,740 కోట్లతో పోలిస్తే 32 శాతం దూసుకెళ్లడం గమనార్హం. ఈ రాబడే కంపెనీ లాభాలు నిలదొక్కుకోవడంలో ప్రధానంగా దోహదం చేసినట్లు కనబడుతోంది. కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వల పెట్టుబడులపై ఈ ఆదనపు ఆదాయం లభిస్తోంది.
 
 రిఫైనింగ్‌పై మెయింటెనెన్స్ ప్రభావం...
 కంపెనీ ముడిచమురు రిఫైనింగ్ వ్యాపారం క్యూ3లో కాస్త తడబడింది. పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు లాభం(ఎబిటా) 13.1 శాతం తగ్గింది. అయితే, పెట్రోకెమికల్స్ విభాగం ఎబిటా 9.7 శాతం వృద్ధితో రూ. 2,124 కోట్లకు పెరగడం కంపెనీకి కొంత చేదోడుగా నిలిచింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆర్‌ఐఎల్‌కు రెండు భారీ చమురు శుద్ధి రిఫైనరీలు ఉన్న సంగతి తెలిసిందే.  నిర్వహణ పనుల(మెయింటెనెన్స్) కోసం ఇందులో ఒక ప్లాంట్‌ను కొద్దికాలంపాటు మూసివేయడం వల్ల డిసెంబర్ త్రైమాసికంలో తక్కువమొత్తంలో ముడిచమురును శుద్ధి చేశామని కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో ఆదాయాలు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని వివరించింది.
 
 కేజీ-డీ6లో ఉత్పత్తి కిందికే...
 అక్టోబర్-డిసెంబర్ మూడు నెలల్లో కేజీ-డీ6 క్షేత్రాల్లో చమురు-గ్యాస్ ఉత్పత్తి మరింత పడిపోయింది. దీంతో ఈ విభాగంలో ఆదాయం కూడా రూ. 1,733 కోట్లకు తగ్గింది. క్రితం ఏడాది క్యూ3లో రూ. 1,921 కోట్లతో పోలిస్తే 10 శాతం మేర క్షీణించింది.
 
 సిల్వాస్సాలో కొత్తగా పాలియెస్టర్ తయారీ ప్లాంట్‌ను డిసెంబర్ క్వార్టర్‌లోనే ఆరంభించాం. మా ప్రధాన వ్యాపారమైన చమురు-గ్యాస్, పెట్రోకెమికల్స్ విస్తరణ కోసం ఉద్దేశించిన 12 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులో ఇది తొలిమెట్టు. రిటైల్ వ్యాపారం కూడా భారీ వృద్ధి పథంలో కొనసాగుతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా అనిశ్చితి వాతావరణంలోనూ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ విభాగాల్లో మెరుగైన పనితీరును సాధించగలిగాం.
 - ముకేశ్ అంబానీ, ఆర్‌ఐఎల్ సీఎండీ
 
 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు

  • డిసెంబర్ నాటికి ఆర్‌ఐఎల్ వద్ద నగదు, తత్సంబంధ నిల్వలు రూ.88,705 కోట్లుగా లెక్కతేలాయి.
  • కంపెనీ మొత్తం రుణ భారం రూ. 81,330 కోట్లకు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌లో రుణాలు రూ. 72,427 కోట్లే.
  • అప్పులు, నగదు నిల్వలను బేరీజు వేస్తే కంపెనీ నికరంగా రుణ రహితంగా ఉన్నట్లే లెక్క.
  • షేరు(రూ.10 ముఖ విలువ) వారీ ఆర్జన(ఈపీఎస్) డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ. 17.1గా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో, ఈ ఏడాది క్యూ2లో ఈపీఎస్ రూ.17గా నమోదైంది.

 
 ‘పండుగ’ చేసుకున్న రిటైల్ వ్యాపారం...
 రిలయన్స్ రిటైల్ వ్యాపార ఆదాయం క్యూ3లో 38 శాతం వృద్ధి చెంది రూ. 3,927 కోట్లకు చేరింది. పండుగ సీజన్‌లో అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో రిటైల్ విభాగం ఆదాయం రూ. 2,839 కోట్లుగా నమోదైంది. మొత్తంమీద క్యూ3లో పన్నులు, వడ్డీ చెల్లింపుల ముందు లాభాలు  రూ. 106 కోట్లకు చేరాయి. గడిచిన మూడు నెలల్లో కొత్తగా 90 స్టోర్లను ఏర్పాటు చేసింది. డిసెంబర్ చివరికి రిలయన్స్ రిటైల్ మొత్తం 141 నగరాల్లో 1,577 స్టోర్లను నిర్వహిస్తోంది.
 

>
మరిన్ని వార్తలు