స్టార్టప్ కంపెనీలకు రిలయన్స్ చేయూత

11 Mar, 2015 01:56 IST|Sakshi
స్టార్టప్ కంపెనీలకు రిలయన్స్ చేయూత

వివిధ రంగాల్లో 11 సంస్థల ఎంపిక
 
ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) స్టార్టప్ కంపెనీలకు చేయూతనందించనుంది. దీనిలో భాగంగా ఆర్‌ఐఎల్ వెంచర్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జెన్‌నెక్స్ట్ వెంచర్స్ 11 స్టార్టప్‌లకు మెంటార్‌గా వ్యవహరించనుంది. మైక్రోసాఫ్ట్ వెం చర్స్ భాగస్వామ్యంతో స్టార్టప్‌లకు ఆసరాగా నిలి చేందుకు గతేడాది ఈ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్‌ను రిలయన్స్ ప్రారంభించింది. కాగా, మొత్తం 267 స్టార్టప్‌లు దీనికి దరఖాస్తు చేసుకోగా... 11 సంస్థలను ఎంపిక చేసినట్లు ఆర్‌ఐఎల్ తెలియజేసింది. ఇందులో విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా, రిటైల్, మానవవనరులు తదితర రంగాకు చెందిన స్టార్టప్‌లు ఉన్నాయి.

కాగా, ఎంపికైన సంస్థలకు నవీ ముంబైలోని ఆర్‌ఐఎల్ కేంద్రంలో నాలుగు నెలల కోర్సును నిర్వహించనున్నారు. కొన్ని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టనున్నామని రిలయన్స్, మైక్రోసాఫ్ట్ వెంచర్ సంస్థలు ఇదివరకే సంకేతాలిచ్చాయి. అయితే, తాజా విడతలో ఇన్వెస్ట్‌మెంట్‌పై ఇరు కంపెనీలూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాము ఎంపిక చేసిన స్టార్టప్‌ల వద్ద అద్భుతమైన వ్యాపార వ్యూహాలు ఉన్నాయని, వీటిని కార్పొరేట్లు, పరిశ్రమ నిపుణులు, వెంచర్ క్యాపిటలిస్టులకు అవి వివరిస్తాయని ఆర్‌ఐఎల్ తెలిపింది. వీటిలో కొన్ని స్టార్టప్‌లు ఫోర్టిస్, ఫ్లిప్‌కార్ట్, రేమండ్, క్రెడిట్ సూసీ, డాట్‌క్యాబ్స్, స్నాప్‌డీల్ వంటి కంపెనీల నుంచి వ్యాపార ఒప్పందాలను దక్కించుకున్నాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు